ప్రచారంలో రూటుమార్చిన వైయస్ జగన్!

 ప్రచారంలో రూటుమార్చిన వైయస్ జగన్!

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో తన రూటు మార్చారు. వైయస్ జగన్ బుధవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మబుగాంలోని ధర్మాన కృష్ణదాస్ ఇంటి నుండి బయలుదేరిన ఆయన ఈదులవలసలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఇన్నాళ్లూ విశ్వసనీయత, విలువలకు - కుళ్లు, కుతంత్రాలకు మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించిన వైయస్ జగన్ తన బుధవారం ప్రచారంలో పేదోళ్లకు - కుళ్లు, కుతంత్రాలకు మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. రైతన్నలు, పేదోళ్లు వేసే ప్రతి ఓటు నేతలకు కనువిప్పు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల కోసం తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేసి వేటు పడిన ధర్మాన కృష్ణదాస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

కాగా మంగళవారం కూడా జగన్ నరసన్నపేటలోనే ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. వైయస్ జీవించి ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉండేదని, తమకు అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదని ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందన్నారు.

ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. వైయస్ మరణించాకా ఈ ప్రభుత్వం కొత్తగా ఎవరికైనా మేలు చేసిందా అని ప్రశ్నించారు. ప్రజలకు ఏమీ చేయని నేతలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు ఏమైనా పట్టించుకోకుండా ఉంటూ పదవులు అనుభవించే నేతలు కొందరు ఉంటే, మరికొందరు ప్రజల కోసం పదవులను వదులుకుంటారన్నారు. తన వర్గం నేతలు రెండో రకానికి చెందిన వారన్నారు.