'గబ్బర్‌సింగ్‌' ఆడియో విడుదల విశేషాలు

'గబ్బర్‌సింగ్‌' ఆడియో విడుదల విశేషాలు

పవన్‌కళ్యాణ్ హీరోగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన ‘గబ్బర్‌సింగ్' ఆడియో వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. పవన్ అన్న చిరంజీవి ఈ పాటల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలి క్యాసెట్‌ని చిరంజీవి ఆవిష్కరించి పవన్‌కల్యాణ్‌కి అందజేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటలు విడుదలయ్యాయి. పవన్‌కల్యాణ్‌, శ్రుతిహాసన్‌ జంటగా నటించారు. హరీష్‌శంకర్‌ దర్శకుడు. బండ్ల గణేష్‌ నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.

ఈ పంక్షన్ లో చిరంజీవి ప్రసంగిస్తూ..నా తమ్ముడు పవన్‌కళ్యాణ్ గురించి ఏం చెప్పను? మాటతప్పని వ్యక్తి. నిజాయతీకి మారుపేరు పవన్. తన సినిమాల ద్వారా ప్రేక్షకులను చైతన్యవంతులను చేయాలనే తపన ఉంది తనకి. రామ్‌చరణ్ ‘రచ్చ' సినిమా ఒక రచ్చ అయితే.. ఈ ‘గబ్బర్‌సింగ్' రచ్చ రచ్చే. దేవిశ్రీప్రసాద్‌లో మంచి ఎనర్జీ ఉంది. హరీష్ ప్రతిభావంతుడు. గణేష్ ఒక ప్యాషన్‌తో సినిమాలు తీస్తాడు. ఈ సినిమాకి సంబంధించిన ఒక పాటలో ‘కెవ్వు కేక..' అని ఉంది. ఈ సినిమా విడుదలైన తర్వాత కెవ్వు కేకే అని చెప్పారు. 

అలాగే..అభిమానుల చప్పట్లు, కేరింతలే మాకు ప్రాణ వాయువులు. ముప్ఫై అయిదేళ్ల కిందట సినిమాల్లోకి రావాలి.. అనే ఆలోచన నాకు రాకపోతే మా కుటుంబం ఓ విలువైన జన్మని వృథా చేసుకొనేది. ఎప్పటికీ అభిమానులను అలరించే సినిమాలే తీస్తాం. మా అభిరుచి కొద్దీ కొన్ని సినిమాల్లో నటిస్తుంటాం. మా ఇష్టానుసారం సినిమాలు చేయడం కాదు.. అభిమానులకు నచ్చే సినిమాల్లో నటించడమే మా ధర్మం. రామ్‌చరణ్‌కీ ఇదే మాట చెప్పా. రెండో సినిమా 'మగధీర' తరవాత 'ఆరెంజ్‌'లో లవర్‌బోయ్‌గా కనిపించాడు. అది అనుకొన్న విజయం సాధించలేదు. అభిమానుల కోసం 'రచ్చ' అనే సినిమాలో నటించాడు. ఆదరిస్తున్నారు. 'హిట్లర్‌' తరవాత నేనూ అలానే ఆలోచించాను. పవన్‌ కూడా కొత్తగా ఉండాలనే ప్రయత్నంతో కొన్ని సినిమాలు చేశాడు. అవేం చెడ్డ సినిమాలేం కావు. కానీ ఫలితాలు రాలేదు. ఈసారి 'గబ్బర్‌సింగ్‌' సినిమాతో రచ్చ రచ్చ చేస్తాడు అన్నారు చిరంజీవి.

అనంతరం పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ...ప్రతి సినిమాకూ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికే శాయశక్తులా ప్రయత్నిస్తాం. అలాగే ఈ సినిమాకి కూడా అందరం పని చేశాం. మీ ఆదరణకు నోచుకుంటుందని ఆశిస్తున్నాను. ప్రతీ సినిమాకీ ఒకేలా కష్టపడతాం. ప్రేక్షకులకు వినోదం అందించాలనే ప్రయత్నిస్తాం. ఈ సినిమా కూడా పరిపూర్ణ వినోదం ఇవ్వాలని టీమ్‌ అంతా ప్రయత్నించింది అని అన్నారు. 


దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ...కాలేజ్ రోజుల్లో పవన్‌కళ్యాణ్ షూటింగ్‌ని గోడపై నుంచి ఎగిరెగిరి చూసేవాడ్ని. అలాంటి నేను ఆయనతో సినిమా చేయగలిగాను. యాక్షన్ అనగానే సెట్లోకి వచ్చి, కట్ చెప్పగానే వెళ్లిపోయే నటుడు కాదాయన. ఒక డైలాగ్ చెప్పాలన్నా, విలన్‌ని కొట్టాలన్నా.. అసహజంగా ఉంటే చెయ్యరు. నేను పవన్‌ కల్యాణ్‌ అభిమానిని. 'తొలిప్రేమ', 'ఖుషి' సినిమాలు ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. 'గబ్బర్‌సింగ్‌' సినిమా నా చేతుల్లో పెట్టిన రోజు ఎప్పటికీ గుర్తించుకొంటా అన్నారు.

ఈ కార్యక్రమంలో నాగబాబు, శ్రీను వైట్ల, శ్యాంప్రసాద్‌రెడ్డి, దిల్‌ రాజు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు.