అమితాబే సూపర్‌స్టార్: రజనీకాంత్

అమితాబే సూపర్‌స్టార్: రజనీకాంత్

 తన దృష్టిలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబచ్చన్ మాత్రమే సూపర్‌స్టార్ అని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. ‘‘నా వరకు అమితాబే సూపర్‌స్టార్. ప్రతి సినిమాను మొదటి చిత్రంగానే భావిస్తా. దర్శకుడు, నిర్మాత ఎంపిక విషయంలో సెలెక్టివ్‌గా ఉంటాను'' అని 61 ఏళ్ల రజనీ చెప్పారు. తనను సూపర్‌స్టార్‌గా పిలవడంపై ప్రశ్నించినప్పుడు రజనీ పైవిధంగా స్పందించారు. ‘కొచ్చడయాన్' షూటింగ్ కోసం ఆయనిక్కడకు వచ్చారు. బెంట్లే హోటల్‌లో బసచేసిన ఆయన గత సాయంత్రం మీడి యాతో మాట్లాడారు. అనారోగ్యం నుంచి 90 శాతం కోలుకున్నానని చెప్పారు. తనకోసం ప్రార్థించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

‘కొచ్చడయాన్'ను దీపావళి కానుకగా నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు వెల్లడించారు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 21 ఏళ్ల తర్వాత ఈ సినిమా కోసం రజనీకాంత్ పాట పడడం విశేషం. రజనీ సరసన దీపికా పదుకునే, ఇతర పాత్రల్లో శోభన, శరత్‌కుమార్, నాజర్, ఆది పినిశెట్టి నటిస్తున్నారు.