కరీనాకు ‘బిఎండబ్ల్యు' కారు

కరీనాకు ‘బిఎండబ్ల్యు' కారు

కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. అసహ్యించుకుంటే హింస కూడా భరించలేనంత విధంగా ఉంటుందనుకోండి. అది వేరే విషయం.. సల్మాన్ బాగా ఇష్టపడే వ్యక్తుల్లో ‘కరీనాకపూర్' ఒకరు. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇటీవల విడుదలైన హిందీ ‘బాడీగార్డ్'లో ఈ జంట కనువిందు చేసింది. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్'కి సీక్వెల్‌గా ‘దబాంగ్-2'లో నటిస్తున్నారు. ‘దబాంగ్'లో ఉన్నట్లుగానే ఈ సీక్వెల్‌లో కూడా ఓ ఐటమ్ పాట ఉంది. 

ఈ పాటను కరీనాతో చేయించాలని చిత్రదర్శకుడు, సల్మాన్ సోదరుడు అర్భాజ్‌ఖాన్, సల్మాన్‌లు భావించారు. కరీనాని అడిగితే.. సింపుల్‌గా మూడు నిబంధనలు విధించారట. దీన్ని ఐటమ్ పాటలా ప్రచారం చేయకూడదని, సినిమాలో ఇది డ్రీమ్ సాంగ్ అయ్యుండాలని, ఇప్పటివరకు ఏ ఐటమ్ పాటను చిత్రీకరించని విధంగా ఈ పాట చిత్రీకరణ ఉండాలని కరీనా కోరారట. ఈ కోరికలను సల్మాన్ మన్నించరని, కరీనా స్థానంలో వేరే నాయికను ఎన్నుకోవడం ఖాయమని పలువురు భావించారు. కానీ, కరీనా తన స్నేహితురాలు కాబట్టి ఆమె కోరినట్లే పాటని మలచమని సల్మాన్ ఆజ్ఞాపించారట. 

కరీనా కూడా సల్మాన్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకునే దిశలో, పారితోషికం వద్దని ఖరాకండిగా చెప్పేశారట. ఈ బ్యూటీ చెప్పినంత మాత్రాన కండలవీరుడు ఊరుకోరు కదా. కరీనా కోసం బిఎండబ్ల్యు 7 సిరీస్ కారుని బుక్ చేయాలనుకుంటున్నారట. కోటి నుంచి కోటిన్నరలోపు ఈ కారు ఖరీదు ఉంటుంది. ఒక్క ఐటమ్ పాటకు ఇంత ఖరీదు గల బహుమతా? అని ఆలోచించవచ్చు. కరీనా స్థాయికి తగ్గ బహుమతి ఇదే అన్నది సల్మాన్ భావన. త్వరలో ఈ పాట చిత్రీకరణ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.