బాలీవుడ్‌లో నేనే నంబర్‌వన్

బాలీవుడ్‌లో నేనే నంబర్‌వన్

స్టార్‌డమ్ విషయంలో కరీనాకపూర్‌కీ అసిన్‌కీ మధ్య చాలా తేడానే ఉంది. కరీనా సూపర్‌స్టార్ అయితే... అసిన్ కేవలం స్టార్ మాత్రమే. కానీ ఓ విషయంలో మాత్రం కరీనాకు అసిన్ గట్టిపోటీనే ఇస్తున్నారు. విషయంలోకెళితే... త్రీ ఇడియట్స్, బాడీగార్డ్, రావన్ వందకోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసిన చిత్రాలు. విశేషం ఏంటంటే... ఈ మూడు చిత్రాల్లోనూ కరీనానే నాయిక. ఈ చిత్రాలతో వందకోట్ల హీరోయిన్‌గా బాలీవుడ్ జనాలతో కితాబులందుకుంటున్నారు కరీనా. 

ఆ విధంగా... ఈ విషయంలోనే కరీనాకు అసిన్ పోటీగా తయారయ్యారు. అసిన్ కథానాయికగా నటించిన గజనీ, రెడీ చిత్రాలు కూడా వందకోట్ల వసూళ్ల మార్క్ దాటిన సినిమాలే. మొన్నటిదాకా కరీనా నంబర్‌వన్ అయితే.. అసిన్ నంబర్ టూ. కానీ ఇప్పుడు నేనూ నంబర్‌వన్నే అంటున్నారు అసిన్. దానికి కారణం ఇటీవలే విడుదలైన ‘హౌస్‌ఫుల్-2'. ఈ నెల 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 80 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఫస్ట్ ఎడిషన్ ‘హౌస్‌ఫుల్' కంటే ఇదే పెద్ద హిట్ అని బాలీవుడ్ మేధావులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఫ్లాపుల్లో ఉన్న అక్షయ్‌కుమార్‌కి నూతనోత్సాహాన్ని అందించిన చిత్రమిది. మరో విషయం ఏంటంటే... ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా... లీడ్‌రోల్ మాత్రం అసిన్‌దే. ఇంకో రెండుమూడు రోజుల్లో ఈ చిత్రం వంద కోట్లను దాటేయడం ఖాయం. దాంతో కరీనాతో పాటు, అసిన్ కూడా వందకోట్ల హీరోయిన్‌గా అవతరిస్తారు. సో... సౌత్ నుంచి వెళ్లిన అసిన్, అక్కడ స్టార్ హీరోయిన్లతో పోటీపడటం దక్షిణాది వారందరికీ గర్వకారణమే కదా!