ముందు కొంచెంసేపు ఆలోచించాను

 ముందు కొంచెంసేపు ఆలోచించాను

‘ముంబయ్ నాకు కొత్త కాదు. పదేళ్లు అక్కడ పెరిగిన తర్వాత గోవా షిఫ్ట్ అయ్యాం. అక్కడే మోడలింగ్ మొదలుపెట్టాను' అన్నారు ఇలియానా. దక్షిణాదిన పలు చిత్రాల్లో మెరిసిన ఈ అందం ఈ ఏడాది ఉత్తరాది తెరను మెరిపించబోతున్నారు. హిందీలో ఆమె చేసిన తొలి చిత్రం ‘బర్ఫీ' నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఇటీవలే తన పాత్రకు ఇలియానా డబ్బింగ్ చెప్పుకున్నారట. ఆమె వాయిస్ బాగుందని, ఇలియానా బాగా డబ్బింగ్ చెప్పిందని చిత్రదర్శకుడు అనురాగ్‌బసు అభినందిస్తున్నారు.

హిందీలో తనకిది తొలి చిత్రమే అయినా, ఈ నగరంతో తనకెంతో అనుబంధం ఉందని చెబుతూ పై విధంగా స్పందించారు ఇలియానా. ఈ గోవా బ్యూటీ ‘బర్ఫీ' గురించి మరిన్ని విశేషాలు చెబుతూ - ‘‘ఈ చిత్రంలో నన్ను తీసుకోవాలని అనురాగ్‌బసు అనుకున్నప్పుడు, ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. దాదాపు గంటసేపు బసు నాతో మాట్లాడారు. ‘నేను వెతుకుతున్న శ్రుతి నీలో ఉంది. ఈ సినిమాకి నిన్ను ఫైనలైజ్ చేస్తున్నాను' అని ఆయన చెప్పారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఒప్పుకోవాలా లేక వదులుకోవాలా? అనేది నాకు అర్థం కాలేదు. 

అందుకని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కొంచెం టైమ్ తీసుకున్నాను. ఇది మంచి, అది చెడు అని చెప్పడానికి నాకు ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లేరు. అందుకని నా నిర్ణయాలు నేనే తీసుకోవాలి. కొంత తర్జన భర్జన తర్వాత ‘బర్ఫీ' నాకు ప్లస్ అవుతుందనిపించింది. ఇలాంటి మంచి అవకాశం నాకు భవిష్యత్తులో రాదనే ఫీలింగ్ కలిగింది. దాంతో ఈ సినిమా ఒప్పుకున్నాను. 1970 నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. సినిమా లుక్ అందుకు తగ్గట్టుగా ఉంటుంది. ఒక డిఫరెంట్ మూవీని చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది'' అని చెప్పారు.