నడకదారిన వచ్చే భక్తులకు టీటీడీ పెద్దపీట

నడకదారిన వచ్చే భక్తులకు టీటీడీ పెద్దపీట

శ్రీవారి భక్తులకు చేరువయ్యే దిశగా టీటీడీ కొత్త కొత్త ఏర్పాట్లతో దూసుకువెళ్తోంది. మరీ ముఖ్యంగా నడకదారిన స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు పెద్దపీట వేయనున్నట్లు టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ప్రకటించారు. చల్లటి తాగునీటిని అందించడంతో పాటు, అన్నప్రసాదం వితరణను 15వేలకు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. 

మంగళవారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ... భక్తులకు మరింత చేరువయ్యేందుకు కొత్త ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. భక్తుల సమస్యలను తెలుసుకోవడానికి టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు రంగంలోకి దిగారు. బుధవారం కాలినడక దారిలో ఆకస్మికంగా పర్యటించిన కనుమూరి ... భక్తులను కలుసుకొని, వారి సమస్యలను అడిగి తెల్సుకున్నారు. 

కాలినడకన వచ్చే భక్తులకు ఇకనుంచి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు చల్లటినీరు అందించడంతోపాటు , 5 వేల మంది భక్తులకు కేటాయించే అన్నప్రసాదం వితరణ 15 వేలకు పెంచాలని ఆదేశించారు. గాలిగోపురం వద్ద అన్నప్రసాదం సముదాయం ఏర్పాటు చేసి భక్తులకు నిరంతరం అన్నప్రసాదం సరఫరా అయ్యేటట్టు ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని టీటీడీ చైర్మన్ అధికారులను హెచ్చరించారు. ఈ వేసవిలో ఏమైనా ప్రత్యేకమైన సదుపాయాలు కావాలంటే, టీటీడీ దృష్టికి తేవాలని భక్తులకు సూచించారు.