గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు

 గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు

క్రీస్తు ఆత్మత్యాగానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు గుడ్‌ ఫ్రైడే ను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. 40 రోజులపాటు ఉపవాసాలు, ప్రార్ధనలతో గడిపిన క్రైస్తవులు క్రీస్తు శిలువనెక్కిన ఈ రోజును అతి పవిత్రంగా భావిస్తారు. వాటికన్‌ సిటీలో పోప్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఉపదేశం చేశారు. భారత్‌లోనూ చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు జరుపుతున్నారు. ఓ యుగపురుషుని రక్తం చిందిన రోజుది. సర్వజనుల కోసం ఏసు శిలువనెక్కినరోజు. 

శిలువపై జీసస్‌ చెప్పిన ఏడు వాక్యాలను మననం చేసుకొనే రోజు. విశ్వాసులు భక్తిశ్రద్దలతో ప్రార్ధనలు చేసే రోజు. అదే గుడ్‌ ఫ్రైడే. మరణ శిక్షార్హమైన నేరమేదీ ఆయన చేయకపోయినా...తాను యూదుల రాజునని చెప్పుకుంటున్నాడని, అది రాజద్రోహమంటూ ఆనాటి ప్రభుత్వం ఆయనకు మరణ శిక్ష విధించింది. పాప బానిసత్వం నుండి మానవులను విడుదల చేయాలన్న దైవ సంకల్పం మేరకు యేసు బలిపశువుగా ఆ శిలువకు తనను తాను అర్పించుకుని మరణించారు. 

నీవలె నీ తోటివారిని ప్రేమించు అంటూ తన బోధనలతో ప్రపంచ మానవాళిని సన్మార్గంవైపు నడిపించిన జీసస్ బోధనలను మత గురువులు తమ సందేశాల ద్వారా అందిస్తున్నారు. ప్రార్ధనా మందిరాల్లో అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. సత్యం, క్షమాపణ, ప్రేమ, త్యాగం, అహింస, పరస్పరాభిమానాలు శాంతి, సౌభ్రాతృత్వాలతో ప్రజలు మెలగాలని మత పెద్దలు సందేశాన్ని అందించారు.