ఉపపోరుకు జంకుతున్న కాంగ్రెస్‌

ఉపపోరుకు జంకుతున్న కాంగ్రెస్‌

18 స్థానాల్లో జరుగబోయే ఉప ఎన్నికల్లో కడప జిల్లాలోని మూడు నియోజకవర్గాలు ప్రత్యేకతను సంతరించుకోబోతున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధిష్టానాలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక్కడ ఉప ఎన్నికల బాధ్యతలు స్వీకరించడానికి కాంగ్రెస్‌ నేతలు ముందుకు రావడం లేదు. 

18 స్థానాల్లో జరుగబోయే ఉప ఎన్నికలు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కడప జిల్లాలో రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు స్థానాల్లో ఉపపోరు జరుగనుంది. అయితే... ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు అంతగా పట్టు లేదని నేతలు ముందే భయపడుతున్నారు. ఎన్నికల బాధ్యతలు భుజాన వేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రతికూల ఫలితాలు వస్తే అధిష్టానంతో చీవాట్లు పడాల్సి వస్తుందని భావిస్తున్నారు. 

జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఎన్నికల బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలో కడప ఎంపిగా పోటీ చేసి ఓడిపోయిన డి.ఎల్‌.రవీంద్రారెడ్డి తనకు ఉప ఎన్నికల నుంచి మినహాయింపు ఇవ్వాలని అంటున్నారు. మరో మంత్రి అహ్మదుల్లా ఉప ఎన్నికల ప్రస్తావనే తీసుకురావడం లేదు. ఎం.పి సాయిప్రతాప్‌ కూడా ఎన్నికల బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి చూపడం లేదు. రాజ్యసభ సీటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వై.ఎస్‌.వివేకానందరెడ్డి కూడా పార్టీ వ్యవహారాల్లో అంత చురుకుగా పాల్గొనడం లేదు. 

మరోమంత్రి సి.రామచంద్రయ్య తమ వర్గం వారికి రాజంపేట టికెట్ ఇస్తే ఆ నియోజకవర్గానికి మాత్రమే బాధ్యత వహిస్తానని చెబుతున్నట్లు తెలుస్తోంది. రామచంద్రయ్య ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలని... లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే వీరశివారెడ్డి అన్నారు. ఎన్నికల బాధ్యతల నుంచి ఎవరికి వారు తప్పించుకుంటుండంతో క్యాడర్‌లో నిరుత్సాహం నెలకొంది. కడప ఉప ఎన్నికల బాధ్యతలు ఎవరు తీసుకుంటారోనని కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.