ఇదో వింత పెళ్లి

ఇదో వింత పెళ్లి


ఆయనకిద్దరు. ఇదేదో సినిమా టైటిల్‌ కాదు. రియల్‌ సీన్‌. నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటన. పాలమూరు జిల్లా యువకుడు ఒకేసారి ఇద్దరిని పెళ్లాడాడు. వరుసకు మేన కోడళ్లయిన అమ్మాయిలకు తాళి కట్టాడు. ఒకే పందిరిలో జరిగిన ఈ పెళ్లిని చూసి బంధువులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇదో వింత పెళ్లి. ఒకే ముహూర్తానికి, ఒకే పందిట్లో ఇద్దరికి తాళి కట్టాడో యువకుడు. మేన కోడళ్లను జీవిత భాగస్వాములుగా స్వీకరించాడు. వేద మంత్రాలు, బంధువుల దీవెనల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. 

మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌కు చెందిన నరేందర్‌గౌడ్‌, సుశీల దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్దమ్మాయి సుష్మశ్రీ మానసికంగా ఎదగలేదు. చిన్నమ్మాయి సంధ్య మాత్రం చలాకీగా ఉంటుంది. ఇద్దరమ్మాయిలూ పెళ్లీడుకొచ్చారు. కానీ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ఇష్టపడలేదు. ఈ పరిస్థితుల్లో పెద్దమ్మాయిని వదిలేసి, చిన్నమ్మాయికి పెళ్లెలా చేయాలని తల్లిదండ్రులు మదన పడ్డారు. 

ఈ నేపథ్యంలో సుశీలకు ఓ ఆలోచన వచ్చింది. తన సొంత తమ్ముడికే ఇద్దరు కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. వెంటనే పూసల్‌పాడులో ఉంటున్న సోదరుడు ఖాజన్‌గౌడ్‌కు కబురంపింది. ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకోమని ఒప్పించింది. 

పెద్దమ్మాయికి కొత్త జీవితాన్ని ప్రసాదించాలని కోరింది. అక్కా- బావల కోరికను ఖాజన్‌గౌడ్‌ మన్నించాడు. ఈ పెళ్లికి ఓకే చెప్పాడు. ఈ వింత పెళ్లిని చూసిన బంధువులు, శ్రేయోభిలాషులు తెగ సంబరపడ్డారు.