కొత్తదనం కోసం...!

కొత్తదనం కోసం...!

ఒక చిత్రానికి మరో చిత్రానికి పొంతనలేకుండా విభిన్నమైన పాత్రలు చేయాలని కోరుకునే నేటితరం కథానాయకులలో అల్లు అర్జున్‌ ఒకరు. ఆదివారంనాడు ఆయన జన్మదినోత్సవం. ఈ సందర్భంగా ఆయన కెరీర్‌ను ఒకసారి పరిశీలిస్తే, నటుడిగా ఆయనకు ఉన్న తపన, అభిరుచి ఇట్టే అర్థమౌతాయి. 'గంగోత్రి' నుంచి 'బద్రీనాథ్‌' వరకు ఆయన చిత్రాలను సింహావలోకనం చేసుకుంటే ఆసక్తికరమైన విషయాలు మనకు గోచరిస్తాయి. చిత్ర పరిశ్రమలోనికి ఆయన అడుగుపెట్టి పదేళ్ళు పూర్తికావస్తున్నాయి. ఈ పదేళ్ళ కాలంలో తాను చేసిన కొన్ని చిత్రాలు ఘన విజయం సాధించగా, కొన్ని చిత్రాలు నిరాశపరిచిన సందర్భాలు లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ, నటుడిగా ఏదో కొత్తదనాన్ని చూపించాలని అర్జున్‌ ఎప్పటికప్పుడు పరితపిస్తుంటారని సన్నిహితులు అంటుంటారు. 'ఆర్య' చిత్రం స్టైలిష్‌ స్టార్‌ అనే గుర్తింపును ఇవ్వగా, 'బన్ని' మాస్‌ ఇమేజ్‌ను అందించింది. ఇక 'హ్యాపీ' ద్వారా లవర్‌బోయ్‌గా పేరుపొంది, 'దేశముదురు' ద్వారా సిక్స్‌ప్యాక్‌ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక 'పరుగు' చిత్రం ఫ్యామిలీ హీరోగా గుర్తింపును ఇవ్వగా, 'వేదం' కోసం తన ఇమేజ్‌ను సైతం పక్కనపెట్టడం విశేషం. 'బద్రినాథ్‌' తర్వాత ఆయన చేస్తున్న తాజా చిత్రం 'జులాయి' నిర్మాణ దశలో ఉంది. ఇందులో ఇలియానా నాయికగా నటిస్తుండగా, త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక, అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై డి.వి.వి.దానయ్య సమర్పణలో కె.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.