తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

భానుడి ప్రకోపానికి రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణ జిల్లాల్లో సూర్య ప్రతాపం అధికంగా కనిపించింది. ఎండవేడికి తాళలేక జనం అల్లాడుతున్నారు. రోడ్లపైకి రావడానికి జంకుతున్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. నిజామాబాద్‌లో ఆదివారం దాదాపు 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 11 గంటలకే రోడ్లపై జన సంచారం కనిపించలేదు.

హైదరాబాద్‌లో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌లో ఇది అత్యధిక ఉష్ణోగ్రత. వాయువ్య దిక్కు నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా వేడిమి పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. గాలిలో తేమలేమి కారణంగా వచ్చే రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.