రాజ్యసభ సభ్యుడిగా చిరు ప్రమాణం

రాజ్యసభ సభ్యుడిగా చిరు ప్రమాణం

 రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తెల్లటి కుర్తా, పైజామా వేసుకుని రాజ్యసభకు హాజరయ్యారు. ఆయన ఆంగ్లభాషలో ప్రమాణం చేశారు. కాగా, రేణుకా చౌదరి హిందీ భాషలో ప్రమాణం చేశారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన మరో నాయకుడు రాపోలు ఆనంద భాస్కర్ తెలుగు భాషలో ప్రమాణం చేశారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు.

సిఎం రమేష్ కూడా మంగళవారంనాడే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. చిరంజీవి, రేణుకా చౌదరి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్ ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెసు నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సిఎం రమేష్ తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 

ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన రవిశంకర్ ప్రసాద్, తదితరులు కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులను చైర్మన్ అన్సారీ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వారిలో నలుగురు కాంగ్రెసు నుంచి ఎన్నిక కాగా, ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు.