తానే తాన్‌సేన్‌గా నటించాలని...

తానే తాన్‌సేన్‌గా నటించాలని...

జాకీష్రాఫ్‌కు తన మనసులోని మాటను బయటపెట్టేశాడు. మొఘల్‌కాలం నాటి హిందుస్తానీ సంగీతకారుడు మిలా తాన్‌సేన్‌గా నటించాలన్నది ఇతని ఆశ. సంజయ్‌లీలా భన్సాలీ వంటి వాళ్లు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తే బాగుంటుందనేది జాకీ అభిప్రాయం. సంజయ్ కొన్నేళ్ల క్రితం షారుక్ హీరోగా తీసిన దేవ్‌దాస్‌లో జాకీ చునీలాల్‌గా కనిపించాడు. ‘మొఘల్ చక్రవర్తి అక్బర్ దగ్గర ‘నవరత్నాలు'గా గుర్తింపు పొందిన తొమ్మిది మంది సంగీతకారుల్లో తాన్‌సేన్ ఒకరు. అంతటి గొప్ప విద్వాంసుడి పాత్రను తెరపై చూపించడానికి సంజయ్ తగిన వ్యక్తి' అని జాకీ చెప్పాడు. నితీశ్ రాయ్ తాజా బెంగాలీ సినిమా జోల్ జంగలే షూటింగ్ కోసం కోల్‌కతా వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ పైవిషయాలు చెప్పాడు. 

బెంగాలీ సినిమాలపై స్పందిస్తూ తనకు ఏయే పాత్రలు ఇవ్వాలనేది దర్శకుల ఇష్టమని, మంచి స్క్రిప్టులను ఎప్పుడూ ఇష్టపడతానని అన్నాడు. వన్యప్రాణుల సేకరణను ఇష్టపడే సంపన్నుడిగా జాకీ ఈ సినిమాలో కనిపిస్తాడు. ‘ఈ పాత్రలోని కొత్తదనం నాకెంతో నచ్చింది. నితీశ్ నాకు మంచి స్నేహితుడు కాబట్టి నో చెప్పలేకపోయాను' అని జాకీ వివరించాడు. ప్రయాగ్ సంస్థ నిర్మించిన జోల్ జంగాలేలో మిథున్ చక్రవర్తి, ముంతాజ్ సర్కార్, రాజ్‌దీప్ గుప్తా, వృజుబిశ్వాస్ ముఖ్యపాత్రలు పోషించారు. రీతుపర్ణో ఘోష్ 2005లో తీసిన అంతర్‌మహల్‌లోనూ ఇతడు నటించాడు. 

ఆ తరువాత టాలీవుడ్ అగ్రనటులతో కనిపించకపోవడంపై మాట్లాడుతూ ‘ఆ విషయం వాళ్లనే అడగాలి. తదనంతరం సినిమాలకు రీతుపర్ణో నన్ను ఎందుకు ఎంపిక చేయలేదో నాకు తెలియదు. గౌతమ్‌ఘోష్, బుద్ధదేబ్ దాస్‌గుప్తా వంటి వాళ్లు కూడా నన్ను సంప్రదించలేదు. గుప్తాతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను కూడా' అని చెప్పాడు. జాకీష్రాఫ్ ఇప్పటి వరకు హిందీతోపాటు తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, కన్నడ, మరాఠీ భాషల్లో తీసిన దాదాపు 150 సినిమాల్లో నటించాడు.