జానారెడ్డి మారిపోయారా..?

జానారెడ్డి మారిపోయారా..?

మంత్రి జానారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ లో సీనియర్ నేత. అవసరమున్నప్పుడు మాత్రమే యాక్టివ్ అవుతూ వార్తల్లో కనిపించే నేత. మంత్రి పదవి రానప్పుడు తెలంగాణపై అందరితో కలిసి గళం విప్పిన లీడర్. మంత్రి కాగానే సైలెంటై పరిమితిమేరకు మాట్లాడుతున్న నాయకుడు. అయితే ఇటీవల ఆయనలో అనూహ్యంగా మార్పు వచ్చింది. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌లో సంభవిస్తున్న పరిణామాలు ఆయన్ను అలర్ట్‌ చేశాయి.

రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో అధిష్టానాన్ని ఆకర్శించే పనిలో బిజీగా ఉన్నారు. పార్టీని.. పార్టీ అధినేత్రిని జగన్ విమర్శిస్తున్నా ఎన్నడూ పల్లెత్తు మాటకూడా మాట్లాడి ఎరుగని జానా... ఉన్నట్టుండి ఒక్కసారిగా జగన్ పై విమర్శలతో విరుచుకు పడుతున్నారు. ఇందంతా వ్యూహత్మకమేనా... జగన్ పై విమర్శలతో హైకమాండ్ ను ఆకర్శించాలనే ఆలోచన ఉందా ... అనే చర్చ రాష్ట్ర రాజకీయల్లో జరుగుతోంది.

సిఎం, పిసిసి పదవులు తెలంగాణ వారికిస్తారనే వార్తలు ఇటీవల గుప్పుమంటుండటం... ఇప్పటికే డి.శ్రీనివాస్, దామోదర రాజనర్సింహ్మ లాంటి నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో జానా కూడా తానేం తక్కువ తినలేదన్నట్టుగా వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు. హఠాత్తుగా ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్‌కు జగన్‌కు నక్కకు నాగలోకానికున్నంత తేడా ఉందంటూ జగన్ పై విరుచుకుపడటం చర్చనీయాంశమైంది.

ఇక ఇవన్ని ఒకెత్తయితే జానారెడ్డి ఉన్నట్లుండి హిందీ భాషపై పట్టుపెంచుకుంటున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా హోం ట్యూషన్‌ సైతం ఏర్పాటు చేసేకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన హిందీ నేర్చుకోవడం వెనుక లోతైన మర్మం ఉందంటున్నారు జానా సన్నిహితులు. ముఖ్యంగా సీఎం పీఠంపై జానా కన్నేసినట్లు కనిపిస్తోంది. అయితే తాను హిందీ నేర్చుకునేందుకు ముఖ్యమంత్రి పదవికి సంబంధం లేదంటున్నారు జానా. తన ఆలోచనలు సీఎం స్థాయిని మించి ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

గ్రామపంచాయితీల్లో కంప్యూటరీకరణలో దేశంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉన్న నేపథ్యంలో పంచాయితీరాజ్ అవార్డ్ తీసుకునేందుకు ఢిల్లీ వెళ్ళిన జానా ఢిల్లీలోని ఏపి భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి హల్ చల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. హస్తిన టూర్‌లో ఆయన పలువురు హైకమాండ్ పెద్దలను కలిసినట్లు సమాచారం.