కష్టాల్లో తేలియాడుతున్న మిర్చి రైతులు

కష్టాల్లో తేలియాడుతున్న మిర్చి రైతులు

ఎర్ర బంగారం రంగు మారిపోతోంది. మిర్చి రైతు బతుకు దయనీయంగా మారింది. పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతన్న కూలీగా మారుతున్నాడు. గుంటూరు జిల్లా మిర్చి రైతు దీనస్థితిపై కథనం.

గుంటూరు జిల్లాలో పండించే ఎర్ర బంగారానికి ఆసియా ఖండంలోనే మంచి డిమాండ్ ఉంది. జిల్లాలో డెల్టా ప్రాంతం మినహా మిగిలిన ప్రదేశంలో ఎక్కువ శాతం రైతులు మిర్చిపంటను పండిస్తారు. ఏటా గుంటూరు మార్కెట్ యార్డు నుంచి ఐదువేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. 

ఇంతటి ప్రాధాన్యం కలిగిన పంటను పండించడానికి రైతులు అప్పులు చేయాడానికి కూడా వెనుకాడరు. అయితే, ఆరుగాలం చెమటోడ్చి పంట పండించిన రైతన్నకు మిగిలేది మాత్రం అప్పలే. గత సంవత్పరం మిర్చి ధర క్వింటాల్‌ పదివేల రూపాయలు పలుకగా ఈ ఏడాది కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే పలుకుతోంది.

దీంతో ఈ ఏడాది ఎకరాకు ఒక్కో రైతుకు 50 వేల రూపాయలు అప్పలు మిగిలాయి. గత సంవత్సరం డిఎపి బస్తా 500 రూపాయలు ఉండగా, ఈసంవత్సరం ఒక్కసారిగా 1100 రూపాయలకు చేరుకుంది. పదివేల ఉన్న మిర్చి ధర మూడు వేల రూపాలయలకు పడిపోయింది. ఈ ధర కూడా వ్యాపారుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తోంది. 

ఇదేవిధంగా పరిస్తితి కొనసాగితే వచ్చే ఖరీప్ సీజనులో రైతులు పంట వేయలేమని చెబుతున్నారు. రైతుల కిచ్చిన వ్యవసాయం రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నామని చెప్పకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని దుస్థితిలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత సంవత్సరం మూడు కోల్డ్ స్టోరోజ్ లలో తగల బడిపోయిన మిర్చికి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని రైతులు వాపోయారు.