'నీకు నాకు డాష్‌ డాష్‌'

 'నీకు నాకు డాష్‌ డాష్‌'

 మద్యం సిండికేట్ల నేపథ్యంలో సాగే ప్రేమకథతో 'నీకు నాకు డాష్‌ డాష్‌' చిత్రాన్ని మలచడం జరిగిందని దర్శకుడు తేజ తెలిపారు. ప్రిన్స్‌, నందితలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ, భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనందప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు తేజ మాట్లాడుతూ, 'ప్రిన్స్‌ను హీరోగాను, హైదరాబాద్‌కు చెందిన నందితను హీరోయిన్‌గాను టాలెంట్‌ హంట్‌ ద్వారా ఎంపికచేశాం. వీరిద్దరూ తమ తమ పాత్రలలో ఎంతో బాగా రాణించారు. 42 మంది నూతన నటీనటులకు కూడా ఇందులో అవకాశం కల్పించాం. కెరీర్‌ పరంగా నాలుగు సంవత్సరాల గ్యాప్‌ అనంతరం నేను చేసిన చిత్రమిది. సినిమా మాకెంతో బాగా నచ్చింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాం. సౌండ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యశ్వంత్‌నాగ్‌ సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. అతను చాలా చక్కటి సంగీతాన్ని అందించారు.' అని చెప్పారు. టెంపో తగ్గుతుందన్న ఉద్దేశ్యంతోనే...! కాగా ఈ చిత్రం కోసం ధర్మవరపు సుబ్రహ్మణ్యంపై చిత్రీకరించిన హాస్య సన్నివేశాలు ఎంతోబాగా పండాయని తేజ అన్నారు. అయితే టెంపోతో రసవత్తరంగా సాగిపోయే సందర్భంలో ఈ హాస్య సన్నివేశాలు ఉండటంవల్ల, కథలో లీనమైన ప్రేక్షకుడి దృషి మరలేందుకు అవకాశం ఉందని, అందుకే ధర్మవరపు సన్నివేశాలను తొలగించామని ఆయన చెప్పారు. నిర్మాత మాత్రం ధర్మవరపు సన్నివేశాలుంటే బావుంటుందని అంటున్నారని, చిత్రం విజయం సాధించిన తర్వాత ఆ హాస్య సన్నివేశాలను కలుపుదామన్న ఆలోచనలో ఉన్నామని తేజ వివరించారు. కాగా 'డాష్‌ డాష్‌'లో ఎలాంటి చెడు అర్థంలేదని నిర్మాత వి.ఆనందప్రసాద్‌ తెలిపారు. తన కుమార్తె, తాను కలసి ఈ చిత్రాన్ని చూశామని, ఎక్కడా ఎలాంటి అసభ్యతకు తావులేనివిధంగా ఈ చిత్రాన్ని తేజ ఎంతో బాగా మలిచారని ఆయన చెప్పారు. తేజ మార్క్‌ ప్రేమకథాచిత్రమిదిని అన్నారు. చిత్రంపై ఉన్న నమ్మకంతో తానే ఈ సినిమాను సొంతగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్యపాత్రలలో పరుచూరి వెంకటేశ్వరరావు, తీర్థ, ధర్మవరపు, తనికెళ్ళ భరణి, బెనర్జీ, సుమన్‌శెట్టి, వేణు, దువ్వాసి, ఉత్తేజ్‌, భాషా, బాలాజీ బద్రినాథ్‌ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌, సంగీతం: యశ్వంత్‌నాగ్‌, మాటలు: రామస్వామి, సమర్పణ: వి.కృష్ణకుమారి, నిర్మాత: వి.ఆనంద ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ.