ఓనమాల జ్ఞాపకాలు

ఓనమాల జ్ఞాపకాలు

పలక, బలపం చేతపట్టుకొని ఓనమాలు దిద్దుకొన్న రోజులు... మాస్టారి బెత్తం దెబ్బలు రుచి చూసిన క్షణాలు... ఎప్పటికీ మరపురావు. ఆ పాత రోజులు మదిలో మెదిలిన ప్రతిసారీ ఏదో తెలియని ఓ ఆనందం. ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పిన గురువుకి ఆ జ్ఞాపకాలు ఎలాంటి ఆనందాన్నిస్తాయి? విశ్రాంత జీవితం గడుపుతున్న నారాయణరావు మాస్టారు గతంలోకి తొంగి చూసుకొన్నప్పుడు ఎలాంటి అనుభూతి కలిగింది? తదితర విషయాలు తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు క్రాంతిమాధవ్‌. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఓనమాలు'. రాజేంద్రప్రసాద్‌ ముఖ్య భూమిక పోషించారు. కల్యాణి మరొక పాత్రధారి. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకొన్నాయి. దర్శకనిర్మాత మాట్లాడుతూ ''మన మూలాల్ని గుర్తుచేసే చిత్రమిది. సొంత ఊరు, స్నేహితులు, అనుబంధాలు... ఇలా మన జీవితంలోని అన్ని అంశాల్నీ స్పృశిస్తుంది. స్కూలు మాస్టారి పాత్రలో రాజేంద్రప్రసాద్‌ నటన ఈ కథకు ప్రధాన బలం'' అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఖదీర్‌బాబు, ఛాయాగ్రహణం: హరి అనుమోలు.