వన్‌మేన్‌ ఆర్మీగా చంద్రబాబు హల్‌చల్‌

వన్‌మేన్‌ ఆర్మీగా చంద్రబాబు హల్‌చల్‌

ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇటీవల బాలయ్య చేసిన కామెంట్‌ రాజకీయాల్ని ఒక్కసారిగా కదిలించింది. వారం రోజుల పాటు టిడిపిలో ఆయన క్రియాశీలక పాత్రపై రకరకాల ఊహాగానాలకు తెరలేచింది. పార్టీ కార్యాలయాన్ని వాస్తు ప్రకారం మార్పులు చేయడానికి స్వయంగా సింహా పర్యవేక్షించారు. ఆ సమయంలో బాలయ్య కీలక పాత్రపై తమ్ముళ్లలో నూతనోత్సాహం కనిపించింది. మూడు రోజుల ముచ్చటన్నట్టు ఘాటైన స్టేట్‌మెంట్లు ఇచ్చిన ఆయన క్రమంగా మళ్లీ సైడైపోయారు. 

బాలయ్య పోటీ చేసే స్థానాలపైన పలు ఊహాగానాలకు ఆ మధ్య కొన్ని రోజుల పాటు తెరలేచింది. మరో అడుగు ముందుకేసి టిడిపి తరపున కాబోయే ముఖ్యమంత్రంటూ కొందరు తమ్ముళ్లు అభిప్రాయపడ్డారు. వాళ్ల స్పీడును గమనించిన బాలయ్య స్టేట్‌మెంట్ల మీద స్టేట్‌మెంట్లను గుక్కతిప్పకుండా వదిలారు. అదంతా సినిమా స్టైల్‌ డైలాగులని ఇప్పుడు తేలిపోయింది. 

ఉప ఎన్నికల హడావుడి ఊపందుకుంటున్న ఈ సమయంలో బాలయ్య ఎమయ్యాడని తమ్ముళ్లు సైతం ప్రశ్నించుకునే స్థాయిలో ఆయన సైలెంటయ్యారు. అవసరమైనప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతారని అధినాయకుడి భవిష్యత్‌ రాజకీయానికి ఏ మాత్రం నష్టం జరగకుండా టిడిపి సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

బసవతారక కాన్సర్‌ ఆస్పత్రి కోసం ఫండ్స్‌ను కలెక్ట్‌ చేసేందుకు విదేశాలకు వెళ్లిన బాలయ్య తిరిగి వచ్చిన తరువాత నేరుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. వాళ్లిద్దరి కలయికతో మళ్లీ రాజకీయ తెరమీదకు వచ్చారు. ఉప ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో పార్టీ కార్యాలయం వైపుగానీ, ఉప ఎన్నికల ప్రక్రియ మీదగానీ దృష్టి పెట్టని ఆయన ముఖ్యమంత్రిని కలవడం చర్చనీయాంశమైంది. 

సింహా వాలకం అలా ఉండగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ పూర్తిగా పార్టీకి దూరంగా ఉన్నారు. ఎన్నికలప్పుడు వస్తానని తమ్ముళ్లకు చెబుతున్న ఎన్టీఆర్‌ పెళ్లి చేసుకున్న తరువాత రాజకీయాలకు దాదాపు స్వస్తి పలికారు. హరికృష్ణ మాత్రం ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కనిపించారు. పార్టీ ఆవిర్భావం దినోత్సం నాడు ఢిల్లీ నుంచి నెగిటివ్‌ కామెంట్స్‌ చేసిన సీతయ్య ఉప ప్రక్రియ జోలికి పోవడంలేదు. సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్న ఉప పోరుకు సీతయ్య ఊసు కూడా పార్టీలో కనిపించకపోవడం నందమూరి హీరోల వాలకం పార్టీ వర్గాల్ల్ని ఆలోచింపచేస్తోంది. 

సీమాంధ్రలో కూడా తెలంగాణ తరహా ఫలితాలతో సరిపెట్టుకుంటే...భవిష్యత్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి భారీ త్రెట్‌ టిడిపికి ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల నుంచి పార్టీని బయటపడేసేందుకు నందమూరి హీరోల సహాయాన్ని తీసుకోని చంద్రబాబు ఒంటరి పోరాటానికి దిగారు. ఒనమేన్‌ ఆర్మీ మాదిరిగా ఉప ప్రచారంలో ఆయన చేస్తోన్న హల్‌చల్‌ ఎలాంటి ఫలితాల్ని ఇస్తాయో చూడాలి.    ax9dumwBLzP-OP8cXCEVCo3VkK8