రైల్వేశాఖ శుభవార్త

 రైల్వేశాఖ శుభవార్త

రైల్వేటిక్కెట్‌కోసం గంటలకు గంటలు క్యూలో నిలబడుతున్నారా....అయినా ట్రైన్‌టైంకి టిక్కెట్‌ కొనుక్కోలేకపోతున్నారా..ఇకమీద ఇలాంటి వాటికి చెక్‌పెట్టొచ్చంటోంది దక్షిణ మధ్య రైల్వే. అదెలా అనుకుంటున్నారా. దక్షిణమధ్య రైల్వే పరిధిలో జనరల్‌ బోగీ ప్రయాణమంటే నరకం చూడాల్సిందే. అందులో సీట్‌ దొరకడం మాట అట్లా ఉంచితే ముందు టిక్కెట్‌ దొరికితే చాలు అనుకోనే పరిస్ధితి. ట్రైన్‌టైం కన్నా కనీసం రెండుగంటల ముందు స్టేషన్‌కు చేరుకోకపోతే అంతే సంగతులు. 

అయితే ప్రయాణికులనుంచి వస్తున్న ఈ విమర్శలకు చెక్‌పెట్టాలని నిర్ణయించింది.. దక్షిణమధ్యరైల్వే. ఇందుకోసం రైల్వేలో స్మాట్‌ కార్డ్‌ సిస్టమ్‌ను పరిచయం చేశారు. ఒక్కసారి 70 రూపాయలు పెట్టి కార్డ్‌ కొనుగోలు చేస్తే చాలు. ఇక టిక్కెట్‌ చింతలన్ని తీరుతాయంటున్నారు అధికారులు. ఎక్స్‌ప్రెస్‌, ఆర్డీనరి, ప్యాసింజర్‌..MMTS రైళ్లలో వెళ్లేందుకు వీలుగా స్మాట్‌ కార్డ్ సిస్టమ్‌ రూపోందించారు. మొబైల్ రీఛార్జ్ తరహాలోనే ఈ స్మాట్‌కార్డులు ఉంటాయి.ప్రతి స్టేషన్లో ఏర్పాట్లు చేసిన టిక్కెట్ వెండింగ్‌ మిషన్ల ద్వారా టిక్కెట్‌ పొందొచ్చు. 

స్మాట్‌కార్డ్‌ కొంటే ఆఫర్లు కూడా ప్రకటిస్తుంది రైల్వే శాఖ. 100 రూపాయలు రీచార్జ్‌ చేసుకుంటే 105 బ్యాలెన్స్‌ ఇస్తామంటున్నారు అధికారులు. మరోవైపు ప్లాట్‌ఫాం టిక్కెట్లు కూడా స్మాట్‌కార్డ్ ద్వార పొందొచ్చట. ప్రస్తుతం హైద్రాబాద్‌లో పలుస్టేషన్లలో ఏర్పాటు చేసిన ఈ ఏటీవిఎమ్‌లు ప్రజలనుంచి ఆదరణ పొందుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్టేషన్లలో విస్తరించాలనుకుంటోంది దక్షిణమధ్యరైల్వే. దీంతో జనరల్ బోగీ ప్రయాణికుల కష్టాలు కొంతైనా తీరే అవకాశాలున్నాయి.