చిన్న పూజ చేయండి.. పెళ్లి అవుతుంది

చిన్న పూజ చేయండి.. పెళ్లి అవుతుంది

మీకు పెళ్లి కావడం లేదా..? ఎన్ని సంబంధాలు చూసినా వివాహ బంధం కుదరడం లేదా..? డోంట్ వర్రీ మెదక్ జిల్లా కెళ్లండి...చిన్న పూజ చేయండి. ..జస్ట్ 40 రోజుల్లో మీరో ఇంటివారవుతారు. ఇది నమ్మకమో...లేక మూఢనమ్మమో. ఈ కాలంలో పెళ్లికానీ ప్రసాదుల సంఖ్య విపరీతంగా పెరగుతోంది. అలాగే సరైన జోడి దొరకడం లేదని కళ్యాణానికి దూరంగా ఉంటున్న అమ్మాయిల సంఖ్య అదే స్థాయిలో ఉంటోంది. ఇలాంటి వాళ్లకు తమ ఊళ్లో కచ్చితమైన పరిష్కారం ఉందంటున్నారు మెదక్ జిల్లా దొంతి గ్రామస్తులు. నమ్మిరండి...బ్రహ్మచర్యానికి టాటా చెప్పండంటున్నారు....ఇంతకీ ఆ ఊళ్లో ఏముందీ..?? 

శివ్వం పేట మండలంలో ఉన్న ఈ దొంతి విలేజిలో.... వేణుగోపాల స్వామి గుడి వుంది. ఇది మాములు ఆలయం కాదండోయి...దీనికి 8 వందల ఏళ్ల చరిత్ర వుంది. అంతేకాదు ఈ దేవాలయానికి మరో ప్రత్యేకత కూడా వుంది....ఎంతో కాలంగా పెళ్లికి మొహం వాచిపోయినవాళ్లు ...ఇక్కడో పూజ చేస్తే చాలు .... వాళ్లింట్లో బాజా బంత్రీలు మోగడం ఖాయమంటున్నారు ఈ ఊరివాళ్లు. అలా ఎంతో మంది శ్రీమతులుగా , శ్రీవారులుగా మారారంటున్నారు. 

ప్రతి మంగళవారం ఇక్కడ మాంగళ్య దోషం, కుజగ్రహ దోషం, శనిదోషం పూజలు జరుగుతాయి. వీటిలో పాల్గొన్న వారికి 40 రోజులు తిరిగేసరికి కచ్చితంగా పెళ్లి అవుతుందట. అలా ఎంతో మందికి జరిగింది కూడా. అంతేకాదు వెళ్లే ముందు ఓ తాయిత్తు కూడా ఇస్తారు పూజారి. అది ధరిస్తే ..అదృష్టం దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంటుందట. 

ఇదంతా వింటుంటే చాలా మందికి నమ్మకం కలగకపోవచ్చు కానీ... ప్రతి వారం ఇక్కడికొచ్చే జనాన్ని చూస్తే మాత్రం ఆ అభిప్రాయం మారుతుందేమో. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో ఈ వేణుగోపాల స్వామి కరుణ కోసం వస్తుంటారు. దీనికి కేవలం ఆ స్వామి మహిమే కారణమంటున్నాడు ఆలయ పూజారి.

విశేషం ఏంటంటే... ఈ ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య ప్రతియేటా పెరుగుతూనే వుంది. వాళ్లలో చాలా మంది ఇక్కడి వచ్చాక పెళ్లి జరిగిందంటున్నారు. అందుకే తమకు తెలిసినవాళ్లను కూడా ఈ ఆలయానికి పట్టుకొస్తున్నాంటున్నారు.మొత్తానికి ఈ వేణుగోపాలుడు... పెళ్లిళ్ల స్పెషలిస్ట్‌గా ఇప్పుడిప్పుడే ఫేమస్ వుతున్నాడు.ప్రస్తుతకాలంలో కళ్యాణం.... పెద్ద సమస్యలా మారడంతో ..చాలా మంది ఈ ఆలయానికి పోతున్నారు. అయితే ఒక్కటే డౌట్. ఇక్కడికొచ్చిన వారికి సంబంధం కుదరడం వెనక నిజంగా స్వామి మహిమా ఉందా..? లేక అలా కలిసొస్తుందా.....ఏమో అంతా పైవాడికే తెలియాలి.