వైభవోపేతంగా భద్రాద్రి రామయ్య పెళ్లి

వైభవోపేతంగా భద్రాద్రి రామయ్య పెళ్లి

: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మిథిలా మైదానంలో ఆదివారం ఉదయం రెండు గంటల పాటు కల్యాణోవత్సవ వేడుకను కన్నుల పండువగా జరిపారు. అభిజిత్ లగ్నంలో పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. ముత్యాలతో తంబ్రాలు పోశారు. ఈ కమనీయ దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు భక్తజనం భద్రగిరికి తరలివచ్చారు. జానకీరాముల వివాహమహోత్సవాన్ని కళ్లారా చూసి పులకించిపోయారు. 

అంతకుముందు కోదండరామునికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీటీడీ తరపున కనుమూరి బాపిరాజు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఆరాధన, దర్శన కార్యక్రమం ఉంటుంది. రేపు స్వామి వారికి పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ హాజరవుతారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తుల కోసం రెండు లక్షల లడ్డూలు, 40 క్వింటాళ్ల తలంబ్రాల బియ్యం సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు.