టెన్షన్‌లో ఛత్తీస్‌గఢ్‌ సర్కారు

టెన్షన్‌లో ఛత్తీస్‌గఢ్‌ సర్కారు

ఛత్తీస్ గఢ్ కలెక్టర్ కిడ్నాప్ వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. కలెక్టర్ విడుదలకు మావోయిస్టులు డిమాండ్ల చిట్టాను రమణ్ సింగ్ ప్రభుత్వానికి పంపారు. తమ కోరికలను ఈనెల 25లోగా తీర్చాలని డెడ్‌లైన్‌ విధించారు. అటు పేట్రేగిపోతున్న మావోయిస్టుల ఆగడాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మావోల డిమాండ్లపై సీఎం రమణ్ సింగ్ ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ ఆచూకీని కనుగొనేందుకు సెర్చ్ బృందాలతో పాటు ప్రత్యేక సాయుధ బలాగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఓవైపు ఒడిషాలో మావోయిస్టుల చెరలో ఉన్న అధికార బీజీడీ ఎమ్మెల్యే ఝినా హికాక ఉదంతం ఓ కొలిక్కి రాకముందే, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు జిల్లా కలెక్టర్‌ను కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. 

మావోయిస్టులు కిడ్నాప్ చేసిన జిల్లా కలెక్టర్‌ను క్షేమంగా విడిపించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తెలిపారు. మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన సుకుమా జిల్లా కలెక్టర్‌ అలెక్స్‌ పాల్‌ మీనన్‌ను సురక్షితంగా విడిపేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. మావోయిస్టుల డిమాండ్లు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

అటు తన భర్త సమర్థవంతమైన కలెక్టర్‌ అని, ఆయనను మానవతాదృక్పథంతో విడుదల చేయాలని పాల్ భార్య ఆశా మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. తన భర్తకు ఆస్తమా ఉందన్న ఆమె మీనన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మీనన్‌ను మావోయిస్టులు తులసీ హిల్స్‌కు తరలించారని తెలుస్తోంది. తులసీ హిల్స్‌ ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా సరిహద్దుల్లో ఉంది. దీంతో పోలీస్‌ బలగాలు ఆ ప్రాంతంతో పాటు అడవులను జల్లెడ పడుతున్నారు.

మరోవైపు కలెక్టర్ ను విడుదల చేసేందుకు మావోలు కొన్ని డిమాండ్లను ప్రకటించారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ ను నిలిపేయాలని.. జైల్లో ఉన్న మావోనేతబొప్పన్న సహా 8మంది నేతలను విడుదల చేయాలని ఛత్తీస్‌గఢ్‌ సర్కారుకు అల్టమేటం ఇచ్చారు. తమ డిమాండ్లకు తలొగ్గకపోతే తీవ్క పరిణామాలు ఉంటాయని మావోలు హెచ్చరించారు. ఈనెల 25లోగా తమ డిమాండ్లను నెరవేర్చాలని వారు స్పష్టం చేశారు. 

దేశంలో పెరిగిపోతున్న మావోయిస్టుల ఆగడాలపై కాంగ్రెస్, బీజేపీ ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై సీరియస్ గా దృష్టి సారించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి. అటు కలెక్టర్ కిడ్నాప్ కు నిరసనగా స్థానికుల పిలుపు మేరకు సుకుమా జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరిగింది.