కాంగ్రెస్ లో చిరు ప్రాధాన్యం తగ్గుతోందా..?

కాంగ్రెస్ లో చిరు ప్రాధాన్యం తగ్గుతోందా..?

కాంగ్రెస్ లో చిరంజీవికున్న ప్రాధాన్యతెంత..? కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఆయన ముఖ్యనేతేనా...? కిరణ్, బొత్స, దామోదర రాజనర్సింహలతో పార్టీ పరిస్థితి, ఉప ఎన్నికలపై చర్చించిన అధిష్టానం చిరును ఎందుకు ఆహ్వానించలేదు? రాజ్యసభతోనే మెగాస్టార్ ను సరిపెడతారారా...? ఇప్పుడు చిరు వర్గంలో గుబులురేపుతున్న ప్రశ్నలివి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఆపద్బాంధవుడిగా ఆదుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. 

తన పార్టీ PRPని కాంగ్రెస్ లో విలీనం చేశారు. విలీనంతరువాత కొంత ఆలస్యమైనా రాష్ట్రంలో రెండు మంత్రి పదవులు..ఒక విప్ పదవి దక్కించుకుంది చిరు వర్గం. ఇక ఇటీవల చిరు కూడా రాజ్యసభ కు వెళ్ళారు. అయితే చిరుకు ఎంపీ సీటుతోనే సరిపెడతారా అనే గుబులు మెగా గ్యాంగ్ లో కనిపిస్తోంది. మొన్నటివరకు పార్టీలో ముఖ్యనేతగా చిరును ఆకాశానికెత్తేశారు. 

ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి...రాబోయే ఉప ఎన్నికల వ్యూహాలు తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్రం నుంచి కిరణ్, బొత్స, దామోదర రాజనర్సింహను ఆహ్వానించి.. చిరును మాత్రం పక్కనపెట్టడం వారికి మింగుడు పడడం లేదు. పార్టీ పటిష్టత, ఉపఎన్నికలుపై ఢిల్లీలో ఆజాద్ తో జరిగిన భేటీకి చిరును ఆహ్వానించక పోవడనికి గల కారణాలపై రాజకీయ నిపుణులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇక చిరును హైకమాండ్ లైట్ తీసుకోవడం ప్రారంభమైందనే భావన వ్యక్తమవుతోంది. 

పార్టీకి అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న తిరుపతి ఉప ఎన్నికల్లో చిరు సామాజిక వర్గం అత్యంత కీలకంగా మారనుంది. మొన్నటి వరకు చిరు ఆ నియోజక వర్గం ఎమ్మెల్యే. అలాంటిది ఆ నియోజక వర్గం గురించి మాట్లాడేందుకైనా చిరును పిలవకపోవడం విశేషం. అయితే చిరంజీవి ఇంత లోతుగా విశ్లేశించుకున్నారో లేదోగానీ.. రాష్ట్రంలో జరిగిన బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో గాంధీభవన్ లో ఉల్లాసంగా పాల్గొన్నారు. 

తన డిమాండ్ తోనే రాష్ట్రంలో సబ్ ప్లాన్ నిధులు దారిమళ్ళకుండా చట్టం చేయబోతున్నారని సంబపడిపోయారు. గాంధాీభవన్లో తనను సొంత కుటుంబసభ్యునిగా ఆప్యాయతగా చూడటం తనకు ఎంతో సంతోషానిస్తోందని ఆనందపడ్డారు. కాంగ్రెస్ లో తానో కార్యకర్తగా చెప్పుకునేందుకు గర్వపడుతున్నానని డైలాగులు దంచేశారు. 

అయితే చిరును పక్కన పెట్డడం పార్టీకి అంతమంచిది కాదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతగా.. ఛరిష్మా ఉన్న క్రౌడ్ పుల్లర్ గా చిరుకు సముచిత స్థానం కల్పిస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.