చరణ్‘జంజీర్' రీమేక్‌పై అమితాబ్

చరణ్‘జంజీర్' రీమేక్‌పై అమితాబ్

నేను నటించిన ‘జంజీర్' చిత్రం రీమేక్ కావడం నాకు ప్రశంస లాంటిదని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. ఈ విషయమై ఆయన తన బ్లాగులో పేర్కొంటూ...ఆ చిత్రం మళ్లీ రావడంపై ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. అద్భుతమైన సినిమాలు మాత్రమే మళ్లీ రీమేక్ చేయబడతాయన్నారు. 

ఈ చిత్రం రీమేక్ విషయంలో నాకు ఎలాంటి అభిప్రాయం లేదని స్పష్టం చేసిన అమితాబ్.... ఒక ఆర్టిస్టుగా ఆ చిత్రంలో పని చేశాను, రెమ్యూనరేషన్ తీసుకున్నాను ఇట్స్ ఓవర్! ఈ చిత్రం రీమేక్ విషయంలో నా అభిప్రాయం కోరడం తప్పే అవుతుంది. నేను శుభాకాంక్షలు మాత్రమే అందించగలను, జంజీర్ చిత్రాన్ని మళ్లీ ఒక విజయవంతమైన చిత్రంగా రూపొందిస్తారని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. 

ఇటీవల రామ్ చరణ్ తనను కలిసిన విషయాన్ని కూడా అమితాబ్ ప్రస్తావించారు. ఇటీవల రామ్ చరణ్, ఆ చిత్ర దర్శకుడు అపూర్వ లఖియా నన్ను కలిశారు. నా ప్రియ స్నేహితుడైన చిరంజీవి తనయుడు చరణ్ సక్సెస్ ఫుల్ నటుడు. వారిద్దరూ నా వద్దకు వచ్చినప్పుడు ఆశీర్వదించి పంపాను అని తెలిపారు. 

జంజీర్ చిత్రం షూటింగ్ నాలుగు రోజుల క్రితమే ముంబైలో ప్రారంభం అయింది. ఈ చిత్రంతో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ మెహ్రా నిర్మాత. చెర్రీ తొలి బాలీవుడ్ ఎంట్రీ కావడంతో ఇటు అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన‘జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది.