జగన్‌కు నోటీసులు అందజేసిన సిబిఐ

జగన్‌కు నోటీసులు అందజేసిన సిబిఐ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అధికారులు బుధవారం నోటీసులు అందజేశారు. ఆస్తుల కేసులో ఈ నెల 25వ తేదిన తమ ఎదుట హాజరు కావాలని సిబిఐ అందులో జగన్‌ను ఆదేశించింది. తదుపరి దర్యాఫ్తులో భాగంగా అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు తమ ముందు హాజరు కావాలని సిబిఐ నోటీసులో పేర్కొంది.

వైయస్ జగన్ గుంటూరు జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిబిఐ అధికారులు మంగళవారం రాత్రే గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. నోటీసులు ఇచ్చేందుకు తమకు సమయం ఇవ్వాలని సిబిఐ అధికారులు జగన్‌ను కోరారు. అందుకు ఆయన ఉదయం పదకొండు గంటలకు రెంటచింతల కానగుమాతా చర్చిలో కలవవచ్చునని చెప్పారు. దీంతో సిబిఐ అధికారులు మాచర్ల నుండి రెంటచింతలకు చేరుకున్నారు.

అక్కడ ఆయనకు వ్యక్తిగతంగా నోటీసులు అందజేశారు. కాగా అంతకుముందు ఈ నెల 28న సిబిఐ కోర్టు ఎదుట హాజరు కావాలని ప్రత్యేక కోర్టు సమ్మన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే అంటే 25న తమ ఎదుట హాజరు కావాలని సిబిఐ బుధవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. సిబిఐ అధికారులు మూడు వాహనాలలో వచ్చారు.

కాగా అంతకుముందు హైదరాబాదులో విచారణకు హాజరయ్యేందుకు తనకు జూన్ 15వ తేది వరకు గడువు ఇవ్వాలని సిబిఐకి జగన్ లేఖ రాసిన విషయం తెలిసిందే. జగన్ ఆ లేఖను తన న్యాయవాదులతో హైదరాబాదులోని దిల్ కుషా అతిథి గృహానికి పంపించారు. సంబంధిత అధికారులు లేరని సిబిఐ కార్యాలయవర్గాలు ఆ లేఖను తీసుకోలేదు.