ఉప పోరు సర్వేలు: జగన్ పార్టీదే విజయం

ఉప పోరు సర్వేలు: జగన్ పార్టీదే విజయం

రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న 18 శాసనసభా స్థానాలకు సంబంధించి తెలుగు టీవీ చానెళ్లు, వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు పలు సర్వేలు నిర్వహించాయి. ఈ సర్వే ఫలితాలన్నీ కాస్తా అటూ ఇటుగా ఒకే రకంగా ఉన్నాయి. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తక్కువలో తక్కువగా 12 సీట్లు, ఎక్కువలో ఎక్కువగా 16 సీట్లు గెలుస్తుందని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. జూన్ 12వ తేదీన 18 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వివిధ సంస్థలు నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఫలితాలపై ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక శనివారం వార్తాకథనాన్ని ప్రచురించింది. 

ఓ ప్రముఖ టీవీ చానెల్ మే 1, 10 తేదీల మధ్య ప్రీ పోల్ సర్వే నిర్వహించింది. జగన్ పార్టీకి 14 సీట్ల దాకా వస్తాయని ఈ టీవీ చానెల్ ప్రీపోల్ సర్వే వెల్లడించింది. తెలుగుదేశం పార్టీకి రెండు, కాంగ్రెసుకు ఒకటి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ఒకటి వస్తాయని అంచనా వేసింది. తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట, ప్రత్తిపాడు స్థానాల్లో, కాంగ్రెసు నర్సాపురం స్థానంలో, తెరాస పరకాల స్థానంలో విజయం సాధించే అవకాశాలున్నట్లు అంచనాలు వేస్తున్నారు. 

తాజా పరిణామాల నేపథ్యంలో పోలింగ్ జరిగే లోగా మరో రెండు విడతలు సర్వేలు నిర్వహించడానికి సిద్ధపడుతున్నారు. ఆస్తుల కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ సమన్లు జారీ చేయడం, సాక్షి మీడియా ఆస్తుల జప్తునకు ఆదేశాలు వంటి పరిణామాల నేపథ్యంలో పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా అనే విషయాన్ని పరిశీలించడానికి ఈ సర్వేలు నిర్వహించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. 

వైయస్ జగన్‌ను అరెస్టు చేస్తే సానుభూతి పెరిగే అవకాశం ఉందని కూడా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దాని వల్ల ఉప ఎననికల ఫలితాలు వైయస్ జగన్ పార్టీకి మరింత అనుకూలంగా మారుతాయని అంటున్నారు. అయితే, సర్వేల ఫలితాలను కాంగ్రెసు పార్టీ నాయకులు తోసి పుచ్చుతున్నారు. జగన్ అవినీతిని ప్రజలు అర్థం చేసుకుంటారని, దాని వల్ల పరిస్థితి ఆయనకు వ్యతిరేకంగా మారుతుందని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. 

కాగా, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు డిపాజిట్లు దక్కవని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంటున్నా పరిస్థితి అలా లేదని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 40 శాతం ఓట్లు, కాంగ్రెసుకు 28 శాతం, తెలుగుదేశం పార్టీకి 32 శాతం ఓట్లు పోలయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. పరకాలలో తెరాస, బిజెపి ఒకటి, రెండు స్థానాల్లో నిలుస్తాయని, కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు 12 నుంచి 18 శాతం ఓట్లు పోలవుతాయని అంచనా వేస్తున్నారు.