మోహన్ బాబు రిహార్సల్స్?

 మోహన్ బాబు రిహార్సల్స్?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాజకీయ పార్టీల పైన రిహార్సల్స్ వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాను మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నానని చెప్పిన అనంతరం ఆయన చర్యలు చూస్తుంటే ఏ పార్టీలో చేరాలనే విషయమై ఆయన తర్జన భర్జన పడుతున్నట్లుగా కనిపిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొదట తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు తాజాగా కాంగ్రెసు పార్టీతో చెట్టాపట్టాలేసుకొని ఆయన తిరగడం చూస్తుంటే పార్టీలను చెక్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొద్దికాలం క్రితం మోహన్ బాబు ప్రకటించారు. ఆ సమయంలో ఆయన  తెలుగుదేశం  పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలోని తన విద్యాసంస్థలలో ఏర్పాటు చేసిన తన అరవయ్యో పుట్టిన రోజు వేడుకలకు చంద్రబాబును ఆహ్వానించారు. ఆయనను ఆకాశానికెత్తేశారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కొన్ని మనస్ఫర్థల మాత్రమే వచ్చాయన్నారు. తాను ఎప్పూడూ బాబును విమర్శించలేదన్నారు.

వేడుకలో పాల్గొన్న చంద్రబాబు కలెక్షన్ కింగ్‌పై ప్రశంసలు కురిపించారు. తామిద్దరం తమ తమ బిజీ బిజీ పనుల వల్ల ఇన్నాళ్లూ దూరంగా ఉన్నామని, ఇక నుండి కలిసి పని చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఓసారి శ్రీకాళహస్తిలో విలేకరులకు అన్నీ తెలుసునని, మంచి పార్టీని సూచిస్తే తాను చేరతానని చెప్పారు. అన్నాహజారేను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పారు. మోహన్ బాబు ఇలా వరుసగా చేసిన వ్యాఖ్యు చూసిన వారు ఆయన ఏ క్షణంలోనైనా టిడిపిలో చేరవచ్చునని భావించారు.

అయితే ఆ తర్వాత మోహన్ బాబు టిడిపి పేరు ఎత్తింతి లేదు,  చంద్రబాబు ను ప్రశంసించింది లేదు. అయినప్పటికీ మోహన్ బాబు టిడిపిలో చేరతారనే ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా మోహన్ బాబు ఇంటికి వెళ్లి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. మోహన్ బాబుతో జగన్ కుటుంబానికి దూరపు బంధుత్వం ఉన్నప్పటికీ ఇరువురు ఒకరి ఇంటికి మరొకరు వెళ్లిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పవచ్చు.

అయితే మోహన్ బాబు టిడిపిలో చేరతారనే ప్రచారం నేపథ్యంలో తన పార్టీలోకి ఆహ్వానించేందుకే జగన్ వచ్చారని అందరూ భావించారు. అలాగే తిరుపతిలో మోహన్ బాబుకు పేరు ఉండటంతో ఉప ఎన్నికలలో మద్దతు ఇవ్వమని అడిగేందుకు కూడా వచ్చి ఉంటారని అందరూ భావించారు. కానీ తమది రాజకీయ భేటీ కాదని, కుటుంబ సంబంధాల నేపథ్యంలో తన తనయుడు విష్ణువర్దన్ దంపతులను అభినందించేందుకు వచ్చారని చెప్పారు. అయితే బాబు వైపా జగన్ వైపా అనే ప్రచారం అప్పుడు జరిగింది.

తాజాగా రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రారంభించిన టిఎస్సార్ లలిత కళా పరిషత్, నెల్లూరు కార్యక్రమంలో పాల్గొన్నారు. టిఎస్సార్ నట వాచస్పది బిరుదును మోహన్ బాబుకే ఇచ్చిందున ఆయన ఖచ్చితంగా పాల్గొనాల్సిందే. కానీ ఆ కార్యక్రమంలో కలెక్షన్ కింగ్ చేసిన రాజకీయ డైలాగులు మాత్రం టిఎస్సార్‌ను గెలిపించాలని నెల్లూరు ప్రజలను కోరినట్లుగా ఉన్నాయి.

అసలు టిఎస్సార్ అక్కడ కళా పరిషత్‌ను ఇప్పటికిప్పుడు ప్రారంభించిందే ఉప ఎన్నికలలో లబ్ధి పొందేందుకు అని భావిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమంలో మోహన్ బాబు రాజకీయ డైలాగులు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిన్నటి వరకు టిడిపి, ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసులోకి మోహన్ బాబు అని చర్చ జరిగింది. తాజాగా అసలు  మోహన్ బాబు  ఏ పార్టీలో చేరాలనుకుంటున్నారనే చర్చ ప్రారంభమైంది. ఆయన పయనమెటో ముందు ముందు తేలనుంది. అయితే అసలు ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఉత్తిదే అనే ప్రచారం కూడా జరుగుతోంది.