రాజా బెయిల్ పిటిషన్ దాఖలు

రాజా బెయిల్ పిటిషన్ దాఖలు

రాజ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టయిన తర్వాత రాజా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం ఇదే మొదటిసారి. ఢిల్లీ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. 

రాజా ఏడాదికి పైగా జైలులో ఉన్నారు. ఆయన 2011 ఫిబ్రవరిలో అరెస్టయ్యారు. మొబైల్ నెట్‌వర్క్ లైసెన్స్‌ల అమ్మకాల్లో రాజా అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐ ఆరోపించింది. పలువురు దరఖాస్తుదారులను పక్కన పెట్టేసి తనకు ఇష్టమైనవారికి 2008లో లైసెన్సులు ఇచ్చినట్లు రాజాపై ఆరోపణలు వచ్చాయి. 

ఓ టీవీ చానెల్‌కు టెలికమ్ కంపనీ నుంచి ముడుపులు చేరవేయడంలో రాజాకు సహాయం చేసినట్లు డిఎంకె అధినేత కరుణానిధి కూతురు, పార్లమెంటు సభ్యురాలు కనిమొళిపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను కూడా సిబిఐ అరెస్టు చేసింది. ఆమెకు నవంబర్‌లో బెయిల్ లభించింది. రాజాకు ఒక్కడికే ఈ కేసులో ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. 

టెలికం మాజీ కార్యదర్శి సిద్ధార్థ్ బెహురాకు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. రాజా హయాంలో కేటాయించిన 122 లైసెన్సులను సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో రద్దు చేసింది. మొదట వచ్చినవారికి మొదట అనే పద్దతిలో కాకుడా బహిరంగ వేలంలో లైసెన్సులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మే పదవ తేదీ రాజా జన్మదినం.