కూతురింట్లో సొమ్ము చిరుదే

కూతురింట్లో సొమ్ము చిరుదే

 తమిళనాడు రాజధాని చెన్నైలోని చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నివాసంపై జరిగిన ఆదాయం పన్ను శాఖ అధికారుల దాడులకూ చిరంజీవికీ సంబంధం అంటగడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. శనివారంనాడు సుస్మిత నివాసంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

సుస్మిత నివాసంలో 80 కోట్ల రూపాయల నగదు లభించిందని, అది చిరంజీవికి సంబంధించిన సొమ్ము అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. ఐటి సోదాల్లో దస్తావేజులు కూడా ఐటి శాఖ అధికారులకు చిక్కాయని, వాటిలో కూడా చిరంజీవి అస్తుల వివరాలున్నాయని తెలిపింది. 

తిరుపతిలో శుక్రవారం ఎన్నికల ప్రచారం ముగించుకుని చిరంజీవి రాత్రి చెన్నైలోని తన కూతురు నివాసానికి వెళ్లారని, చిరంజీవికి అక్కడికి చేరిన సమయంలోనే ఐటి అధికారులు సుస్మిత నివాసంపై దాడులు నిర్వహించారని సాక్షి టీవీ చానెల్ వార్తాకథనం సారాంశం. సొమ్ము పట్టుబడడంతో కలవరం చెందిన చిరంజీవి చెన్నై నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారని తెలిపింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి ఫోన్లు చేయించారని వ్యాఖ్యానించింది. చిరంజీవి ఉప ఎన్నికల కోసం ఆ డబ్బును ఉద్దేశించారనే అర్థం వచ్చేలా కూడా ఆ వార్తాకథనం ఉంది. 

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నివాసంపై ఆదాయం పన్ను శాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐటి అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుస్మిత పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సుస్మిత నివాసంలో ఐటి అధికారులు భారీగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఆదాయం పన్ను ఎగవేశారనే సమాచారంతోనే సుస్మిత నివాసంపై ఐటి శాఖ అధికారులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 12 మంది అధికారులతో కూడిన బృందం సుస్మిత నివాసంలో సోదాలు జరిపింది. సుస్మిత భర్త విష్ణు ప్రసాద్‌ను ఐటి అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.