చిరంజీవి ఎపిసోడ్, మారిన యడ్యూరప్ప

చిరంజీవి ఎపిసోడ్, మారిన యడ్యూరప్ప

కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పెద్దకూతురు ఇంటిపై ఆదాయం పన్ను శాఖ అధికారుల దాడుల వార్త కర్ణాటక మాజీ మంత్రి యడ్యూరప్ప మనసు మార్చిందని అంటున్నారు. చిరంజీవి పెద్ద కూతురు నివాసంలో ఐటి శాఖ అధికారులకు పట్టుబడిన సొమ్ము చిరంజీవికి చెందిందని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి టీవీ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఈ వార్తాకథనమే యడ్యూరప్ప కాంగ్రెసులో చేరాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు చెబుతున్నారు. చిరంజీవిపై వచ్చిన వార్తాకథనం కాంగ్రెసులో చేరితే ఎదురయ్యే పరిణామాలను బేరీజు వేసుకోవడానికి యడ్యూరప్పకు అవకాశం కల్పించిందని అంటున్నారు. 

నిజానికి, ఐటి దాడులు చెన్నైలోని చిరంజీవి వియ్యంకుడి నివాసంలో జరిగాయి. ఈ దాడులతో తనకు ఏ విధమైన సంబంధం లేదని చిరంజీవి చెప్పారు. అయితే, చిరంజీవి వివరణ ఇచ్చేలోగానే యడ్యూరప్ప వెనక్కి తగ్గేలా ఆయన అనుచరులు కొందరు పనిచేశారని అంటున్నారు. పార్టీ బయటకు వెళ్తే ఎదురయ్యే ప్రమాదంపై యడ్యూరప్పకు ఆయన అనుచరులు హెచ్చరికలు చేసినట్లు చెబుతున్నారు.

పార్టీ నుంచి బయటకు వెళ్తే కథ ముగిసిపోతుందని యడ్యూరప్పకు వారు వివరించారని అంటున్నారు. కాంగ్రెసులో చేరితే కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం ఇదే రకమైన పోరాటం చేయాల్సి ఉంటుందని యడ్యూరప్పకు అర్థమయ్యేలా వివరించారని అంటున్నారు. పార్టీలో ఉంటూనే పోరాటం చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుందని యడ్యూరప్ప ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశంసించడం వల్ల యడ్యూరప్ప కాంగ్రెసులోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. 

కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన చిరంజీవిని వైయస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెసు అధిష్టానం పోటీ పెట్టింది. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కుంటే తప్ప చిరంజీవి ముఖ్యమంత్రి కాలేని స్థితిని కాంగ్రెసు అధిష్టానం కల్పించిందని, ఒక వేళ కాంగ్రెసు వచ్చే ఎన్నికల్లో గెలిచినా కచ్చితంగా చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారనే గ్యారంటీ ఏమీ లేదని, అప్పటి రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయో చెప్పలేమని యడ్యూరప్పకు నచ్చజెప్పినట్లు సమాచారం. 

చిరంజీవి కన్నా గొప్ప స్థానం కాంగ్రెసులో చేరితే యడ్యూరప్పకు దొరికే పరిస్థితి ఏమీ ఉండదని, వెంటనే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందనే గ్యారంటీ కూడా లేదని, అందువల్ల పార్టీ మారాల్సిన అవసరం ఏముందని యడ్యూరప్ప అనుయాయులు అంటున్నారు. కాంగ్రెసులో చేరితే సంభవించే పరిణామాలను బేరీజు వేసుకున్న తర్వాత ప్రస్తుత చిరంజీవి పరిస్థితిని చూసిన తర్వాత యడ్యూరప్ప తన మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు.