వైయస్ జగన్ వైపు తలసాని?

 వైయస్ జగన్ వైపు తలసాని?

 తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి తిరిగి పార్టీలోకి వచ్చిన టి. దేవేందర్ గౌడ్‌ను రాజ్యసభకు పంపించడంపై ఆయన  చంద్రబాబు పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దేవేందర్ గౌడ్‌పై ఆయన పార్టీ లోపల నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. 

వైయస్ జగన్ విషయంలో ఆయన మంగళవారం ఆచితూచి మాట్లాడారు. ఆస్తుల కేసులో వైయస్ జగన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారా అని అడిగితే ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఎవరిపైన అయినా చట్ట ప్రకారం చర్యలు ఉండాలని ఆయన అన్నారు. వైయస్ జగన్‌ను అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్న తరుణంలో తలసాని శ్రీనివాస యాదవ్ చాలా మెతగ్గా మాట్లాడడం వల్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగుదేశం పార్టీలో కొనసాగడానికి ఆయన సిద్ధంగా లేరని చెప్పడానికి మరో వ్యాఖ్యను కూడా రాజకీయ విశ్లేషకులు ఉదాహరణగా చూపుతున్నారు. తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నానా, లేదా అనేది ప్రస్తుతం అవసరం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. జగన్ అరెస్టుపై మీడియా ప్రతినిధులు పదే పదే అడిగినా, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తాను మొదటి నుంచీ అంటున్నానని మాత్రమే ఆయన సమాధానమిస్తూ వెళ్లారు. 

ప్రతిపక్షం పనితీరు బాగాలేదని కూడా ఆయన తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేశారు. శ్రీనివాస యాదవ్ మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారు. పైగా, హైదరాబాదులో తెలంగాణ సెంటిమెంటు తక్కువగా ఉంది. దీంతో వైయస్ జగన్ పార్టీలో చేరడానికి ఆయన మానసికంగా సిద్ధమైనట్లు భావిస్తున్నారు. 

వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన మూడు చార్జిషీట్లలో వాన్‌పిక్ సంస్థ పేరు లేకపోవడం వెనక మతలబు ఏమిటని  తలసాని శ్రీనివాస యాదవ్  అడిగారు. ఈ అంశంపై తాను కోర్టుకు వెళ్తానని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న మంత్రులపై ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. వాన్‌పిక్ సంస్థ, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావుపై మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.