చంద్రబాబు పేరెత్తని జూనియర్ ఎన్టీఆర్

చంద్రబాబు పేరెత్తని జూనియర్ ఎన్టీఆర్

 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ విభేదాలు కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో తనకు విభేదాలు లేవంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను విజయవాడలో కలిసిన పార్టీ నాయకుడు వల్లభనేని వంశీతో తన సంబంధాలపై వచ్చిన వార్తలను తోసిపుచ్చుతూ సుదీర్ఘంగా మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు పేరు కూడా ఎత్తలేదు. 

దమ్ము సినిమాపై జరిగిన మీడియా మీట్‌లో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. వంశీతో జగన్ భేటీ తన సూచన మేరకే జరిగిందనే వార్తలను ఆయన ఖండించారు. తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. గతంలో చంద్రబాబును ఆకాశానికెత్తిన ఎన్టీఆర్ ఈసారి పేరు కూడా ప్రస్తావించలేదు. చంద్రబాబును ఆయన గతంలో లవ్లీ లీడర్‌గా అభివర్ణించారు. చంద్రబాబుకు ఇతర ఉపమానాలు కూడా చేర్చి ప్రశంసించారు. ప్రస్తుతం చంద్రబాబు  పేరు ప్రస్తావించకపోవడాన్ని బట్టి విభేదాలు రూపు మాసిపోలేదని వార్తలు వస్తున్నాయి. 

బాబాయ్ బాలకృష్ణ గురించి కూడా ఆయన ఎక్కువగా మాట్లాడలేదు. బాబాయ్ సింహ సినిమా తాను దమ్ము సినిమా చేయడానికి ప్రేరణ అని ఆయన చెప్పుకున్నారు. అంతకు మించి బాలయ్య గురించి ఎక్కువగా మాట్లాడలేదు. దమ్ము సినిమాపై పడుతున్న దెబ్బను దృష్టిలో ఉంచుకుని, అది దెబ్బ తినకుండా చూసుకునే వ్యవహారంలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి మాట్లాడినట్లు, తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటానని, ప్రచారం చేస్తానని చెప్పినట్లు తెలుగు టెలివిజన్ చానెల్స్ వ్యాఖ్యానిస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్  తాత్కాలికంగా ఓ అడుగు వెనక్కి వేసినట్లు మాత్రమే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో కాలు పెట్టాలనే ఉద్దేశం కూడా ఆయనకు ఉన్నట్లు లేదు. తన రాజకీయ ప్రవేశానికి సంబంధించి ఆయనకు సుదీర్ఘ ప్రణాళిక ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అందుకే తాత స్వర్గీయ ఎన్టీ రామారావును తెగ పొగడేశారని అంటున్నారు. తాతగారు స్థాపించిన పార్టీకి దూరం కాబోనని ఆయన అన్నారు.