జప్తుపై నిర్ణయం తీసుకోలేదు: హోంశాఖ

జప్తుపై నిర్ణయం తీసుకోలేదు: హోంశాఖ

  వైయస్సార్ కాంగ్రెసు  పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల జప్తుపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజేంద్ర పాల్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏ విధమైన జీవో గానీ, మెమో గానీ జారీ చేయలేదని ఆయన చెప్పారు. వైయస్ జగన్  ఆస్తుల జప్తునకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సంతకాలు చేసినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజేంద్ర పాల్ ఆ వివరణ ఇచ్చారు. 

ఇదిలా ఉంటే, జగన్ అక్రమాస్తుల స్వాధీన సన్నాహాలు ప్రారంభమయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం పకడ్బందీ వ్యూహం రచించిందని అంటున్నారు. అంచెలవారీగా అటాచ్‌మెంట్ విధానాన్ని పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సర్వ సమాయత్తం చేసినట్లు చెబుతున్నారు. ఇందుకోసం గురువారం హోం శాఖ భారీ కసరత్తు చేసిందని సమాచారం. 

న్యాయనిపుణులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిందని అంటున్నారు. చివరికి చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేయడానికి అడుగులు వేసింది. ఆగమేఘాల మీద ఆస్తులు జప్తు చేసే అవకాశం, అధికారం అందుబాటులో ఉన్నా భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించి పని పూర్తి చేయడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి మోపిదేవి వెంకటరమణకు సీబీఐ నుంచి పిలుపు అందింది. ఈ నెల 21న వ్యక్తిగతంగా వచ్చి విచారణకు హాజరు కావాలని గురువారం మంత్రికి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇదివరకే సిబిఐ మోపిదేవిని ఒకసారి విచారించింది. తాజాగా నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి అరెస్టు అనంతరం మోపిదేవిని మరోసారి పిలిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్. రాజశేఖర్‌రెడ్డి హయాంలో మోపిదేవి పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖా మంత్రిగా ఉన్నారు.