భానుపై మరో కేసు

భానుపై మరో కేసు

 మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్‌పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గురుకుల ట్రస్టు భూవివాదానికి సంబంధించి ఈ కేసు నమోదైంది. గురుకుల ట్రస్టుకు చెందిన 1150 గజాల భూమిని విక్రయించేందుకు భాను కిరణ్ ఒప్పందం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకు భాను కిరణ్ 30 లక్షల రూపాయలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. 

గురుకుల ట్రస్టు భూవివాదానికి సంబంధించి హైదరాబాదులోని పంజగుట్టులో గల ఓ హోటల్లో భాను కిరణ్, ఇతరులు ఒప్పందం రాసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో భాను కిరణ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటి వారంట్ పిటిషన్ దాఖలు చేశారు. భాను కిరణ్‌ను పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. భూమిని అమ్ముతానని చెప్పి ముగ్గురిని భాను కిరణ్‌ బెదిరించాడని ఆరోపణలు వచ్చాయి. హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులు స్టేషన్ గురుకుల ట్రస్టుకు సంబంధించి కేసు నమోదైంది. 

మద్దెల చెరుల సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ అలియాస్ భానుని తమ కస్టడీకి అప్పగించాలని మంగళవారం సైబరాబాద్ పోలీసులు మియాపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణను కోర్టు మే 28కి వాయిదా వేసింది. సైబరాబాద్ పరిధిలో భాను చేసిన సెటిల్‌మెంట్లు, భూ ఆక్రమణలపై విచారించేందుకు ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరోపక్క కూకట్‌పల్లిలో జ్యోత్స్న అనే మహిళను బెదిరించిన కేసులో మంగళవారం విచారణ జరిగింది.

భాను కిరణ్‌కు ఈ నెల 28వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భాను కిరణ్‌పై భూవివాదాల సెటిల్మెంట్లకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయి. ఈ వివాదాల్లో భాను కిరణ్‌ను విచారించేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసులు విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు.