గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్

గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) గనుల అక్రమ తవ్వకాల కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. గాలి జనార్దన్ రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో ఇదే కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి మాత్రం కోర్టు బెయిల్ నిరాకరించింది. గాలి జనార్దన్ రెడ్డి నుంచి రెండు వ్యక్తిగత పూచికత్తులను కోర్టు కోరింది. దేశం విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. పాస్‌పోర్టును తమకు అప్పగించాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. 

బెయిల్‌కు గాలి జనార్దన్ రెడ్డి ఏడు సార్లు దరఖాస్తు చేసుకున్నారు. ఏడోసారి ఆయనకు బెయిల్ మంజూరైంది. అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఎఎంసి) కేసులో గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక రాజధాని బెంగళూర్ జైలులో ఉన్నారు. ఆ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైతే తప్ప గాలి జనార్దన్ రెడ్డి బయటకు రావడానికి వీలు కాదు. సిబిఐ విచారణకు అందుబాటులో ఉండాలని హైదరాబాద్ సిబిఐ కోర్టు గాలి జానర్దన్ రెడ్డిని ఆదేశించింది. నిరుడు సెప్టెంబర్ 5వ తేదీన గాలి జనార్దన్ రెడ్డిని ఒఎంసి కేసులో సిబిఐ అరెస్టు చేసింది.

 
ఒఎంసి కేసులో గాలి జనార్దన్ రెడ్డి ఎనిమిది నెలలకు పైగా జైలులో ఉన్నారు. ఈ కేసులో సిబిఐ రెండు చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది.  శ్రీలక్ష్మి  బెయిల్ పిటిషన్‌ను సిబిఐ కోర్టు తిరస్కరించింది. గాలి జనార్దన్ రెడ్డికి సిబిఐ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను హైకోర్టులో సవాల్ చేయాలని సిబిఐ అధికారులు ఆలోచిస్తున్నారు. ఎఎంసి కేసులో  గాలి జనార్దన్ రెడ్డి పై సిబిఐ అధికారులు చార్జిషీట్ దాఖలు చేయలేదు. చార్జిషీట్ దాఖలు చేయడానికి మరో నెల రోజుల గడువు ఉంది. 

ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు ఎపిఐఐసి నుంచి దఖలుపరిచిన భూమి తాలూకు నోట్‌ఫైల్స్ సమర్పించాలని కోర్టు  సిబిఐ ని ఆదేశించింది.