మంత్రుల విచారణకు సిబిఐ రెడీ

 మంత్రుల విచారణకు సిబిఐ రెడీ

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మంత్రులను విచారించేందుకు సిబిఐ రంగం సిద్ధం చేసుకుంటోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 వివాదాస్పద జీవోలపై మరో ఇద్దరు మంత్రులను విచారించేందుకు నోటీసులు జారీ చేసే ప్రయత్నంలో సిబిఐ ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేసిన గీతా రెడ్డికి నోటీసులు జారీ అవకాశం ఉంది నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యకు ఇప్పటికే నోటీసు జారీ అయింది. 

గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్‌కు కడప జిల్లాలో భూమిని కేటాయిస్తూ జారీ అయిన జీవోపై సిబిఐ గీతా రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. కాగా, జలయజ్ఝంలో పనులు కేటాయింపుతో పాటు ఇండియా సిమెంట్స్‌కు కృష్ణానది నుంచి 10 లక్షల గ్యాలన్ల నీటిని కేటాయిస్తూ అనుకూలంగా జీవో జారీ అయింది. దీనిపై పొన్నాల లక్ష్మయ్యను సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మరి కొంత మంది ఐఎఎస్ అధికారులను కూడా సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది. 

వివాదాస్ప జీవోలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులు జారీ చేసింది. వీరిలో మోపిదేవి వెంకటరమణను సిబిఐ ఇది వరకు ప్రశ్నించింది. మరోసారి ఈ నెల 21వ తేదీన మళ్లీ ప్రశ్నించనుంది. వాన్‌పిక్ ప్రాజెక్టుకు భూముల కేటాయింపుపై మోపిదేవిని సిబిఐ ప్రశ్నించే అవకాశాలున్నాయి. అలాగే, వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో గనుల శాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డిని సిబిఐ రెండు సార్లు ప్రశ్నించింది. దీనిపై సబితా ఇంద్రారెడ్డి శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వివరణ ఇచ్చారు. 

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన జీవోలపై, భూకేటాయింపులపై  పొన్నాల లక్ష్మయ్య  శనివారం వరంగల్‌లో ప్రతిస్పందించారు. సుప్రీంకోర్టు తనకుపై చేసన అభియోగానికి రాతపూర్వకంగా ఇప్పటికే సమాధానం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రేపు సిబిఐ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తానని, భూకేటాయింపులు చట్టబద్దంగానే జరిగాయని ఆయన చెప్పారు. 

కాగా, జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఎస్ఎ అధికారి బ్రహ్మానంద రెడ్డిని సిబిఐ అధికారులు వరుసగా రెండో రోజు శనివారం విచారిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు వారిని విచారిస్తారు