మంత్రులకు 'జగన్' ఉచ్చు

మంత్రులకు 'జగన్' ఉచ్చు

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) గురువారం గోప్యంగా విచారించినట్లుగా తెలుస్తోంది. సుమారు నాలుగు గంటల పాటు ఆమెను సుదీర్ఘంగా విచారించారని తెలుస్తోంది. ఈ కేసులో విచారణ కోసం హాజరు కావాల్సిందిగా సబితాను సిబిఐ అడగడంతో, తన ఇంటికి వచ్చి విచారించాల్సిందిగా ఆమె సిబిఐని కోరింది.

దీంతో గురువారం ఉదయం పదకొండు గంటలకు సిబిఐ అధికారులు సబిత ఇంటికి వెళ్లి దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. వివాదాస్పద 26 జివోల గురించి ఆమెను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. వివాదాస్పద జివోలలో 8 జివోలు సబితనే జారీ చేశారు. దాల్మియా సిమెంట్, రఘురాం సిమెంట్, ఇండియా సిమెంట్, పెన్నా సిమెంట్స్‌కు గనుల కేటాయింపుపై ఆమెను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

సబితా ఇంద్రా రెడ్డి చెప్పిన సమాధానాల పట్ల సిబిఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. దీంతో ఆమెను మరోసారి విచారించే అవకాశముందని అంటున్నారు. సిబిఐ ప్రశ్నలతో సబితా ఉక్కిరి బిక్కయ్యారని తెలుస్తోంది. ఆయా సిమెంట్ కంపెనీలకు అనుమతుల వెనుక ఎవరి ప్రమేయముందని సిబిఐ ఆమె నుండి ఆరా తీసేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయాలలో భాగంగానే గనుల కేటాయింపు జరిగిందని ఆమె సిబిఐకి తెలిపారని సమాచారం.

మరోవైపు సబితా ఇంద్రా రెడ్డిని గోప్యంగా సిబిఐ విచారించడం, ఆమె సమాధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం, మరోసారి విచారించే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఆమెను సిబిఐ అరెస్టు చేసే అవకాశముందనే ప్రచారం కూడా జరుగుతోంది. జగన్ ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

సిబిఐ వారి ఆరుగురిని విచారించే అవకాశముంది. మంత్రి మోపిదేవి వెంకట రమణను ఈ నెల 21న సిబిఐ విచారించనుంది. తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. మరో మంత్రి ధర్మాన ప్రసాద రావును కూడా మరోసారి ప్రశ్నించనుందని తెలుస్తోంది. కాగా ఈ నెల 28న జగన్‌ను తమ ఎదుట హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.