ఈడి పిటిషన్‌పై జగన్‌కు షాక్

ఈడి పిటిషన్‌పై జగన్‌కు షాక్

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డికి  గురువారం మరో షాక్ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి)కి జగన్ ఆస్తుల కేసు మొదటి ఛార్జీషీటు ప్రతిని ఇవ్వవచ్చునని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ప్రత్యేక కోర్టు తెలిపింది.

కాగా తమకు జగన్ ఆస్తుల కేసుకు సంబంధించిన మొదటి ఛార్జీషీట్ ఇవ్వాలని ఈడి సోమవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈడి పిటిషన్‌పై సిబిఐని కోర్టు అడిగింది. దానికి సిబిఐ అభ్యంతరం లేదని చెప్పింది. దీనిపై కోర్టులో వాదనలు జరిగాయి. ఛార్జీషీట్ ప్రతిని ఈడికి ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) మంగళవారం కోర్టుకు తెలిపింది. గురువారం ఈడికి ప్రతిని ఇవ్వవచ్చుని కోర్టు తీర్పు చెప్పింది.

మరోవైపు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో జగన్‌కు చెందిన సాక్షి మీడియాకు ఊరట లభించింది. సాక్షికి ప్రకటనలను నిలిపివేస్తూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జివోపై హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. వచ్చే నెల 16వ తేదిన కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కోర్టు జివోను సస్పెన్షన్‌లో పెట్టింది.

కాగా ఇందిరా టెలివిజన్, జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్ ఫ్రాల బ్యాంకు ఖాతాల స్తంభన, ఈడికి ఆస్తుల కేసు మొదటి ఛార్జీషీట్ ప్రతి ఇచ్చేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు అంగీకారంతో పాటు, జగన్ మీడియా ఆస్తుల జప్తు దిశగా వేగంగా చర్యలు జరుగుతున్న నేపథ్యంలో సాక్షి మీడియాకు ప్రభుత్వం ప్రకటనల నిలిపివేత విషయమై హైకోర్టులో ఊరట లభించిందనే చెప్పవచ్చు.

మరోవైపు బ్యాంకు ఖాతాల స్తంభనపై సాక్షి మీడియా దాఖలు చేసిన  పిటిషన్ విచారణను కోర్టు 22వ తేదికి వాయిదా వేసింది. సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సాక్షి మీడియా హైకోర్టులో రెండు రోజుల క్రితం సవాల్ చేసింది. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కోర్టు 23వ తేదికి వాయిదా వేసింది. గాలికి బెయిల్ ఇవ్వవద్దని సిబిఐ గురువారం కౌంటర్ దాఖలు చేసింది.

ఖాతాల స్తంభన కేసులో సాక్షి తరఫు లాయరు, సిబిఐ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు చేశారు. తమ నెల సరి ఖర్చు రూ.35 కోట్లు ఉంటుందని, రూ.8కోట్లు ఉద్యోగులకని, రూ.20కోట్లు న్యూస్ ప్రింట్ కని, నిర్వహణకు రూ.7కోట్లని సాక్షి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. రోజువారి ఖర్చుల కోసమే తాము కరెంట్ ఖాతాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్తంభన వల్ల నిర్వహణ కష్టమవుతోందని కోర్టుకు తెలిపారు.

స్తంభన వల్ల ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని సిబిఐ తరఫు న్యాయవాది చెప్పారు. నెల మధ్యలోనే తాము ఖాతాలను స్తంభింప చేసినందున జీతాల సమస్య లేదని, కౌంటర్ వేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఖాతాలు ఎందుకు స్తంభింప చేయాల్సి వచ్చిందో కౌంటర్‌లో పూర్తిగా వివరిస్తామని చెప్పారు