పావలా వడ్డీ రుణం పధకం నాదే: సిఎం

 పావలా వడ్డీ రుణం పధకం నాదే: సిఎం

: డ్వాక్రా పథకం ద్వారా మహిళలకు పావలా వడ్డీ రుణం పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి తానే సూచించినట్లు ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. శుక్రవారంనాడు నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో మీ సేవ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యంతో పాటు ఆత్మవిశ్వాసం పొందడానికి ప్రభుత్వం పలు రకాల పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. రాష్టంలోని 26 వేల గ్రామాల్లో ప్రజాపథం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ప్రజాపథంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో మిగతా రాష్ట్రాలు 14 శాతం వడ్డీని రుణాలపై వసూలు చేస్తుండగా, మన రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను బ్యాంకుల ద్వారా 11500 కోట్ల రుణాలను అందిస్తోందని ఆయన చెప్పారు.  వైయస్ రాజశేఖర రెడ్డి కి పావలా వడ్డీ రుణాల పథకాన్ని సూచించి తన నియోజకవర్గంలో ఆ పథకాన్ని ప్రకటింపజేసుకున్నట్లు ఆయన తెలిపారు. 

సూక్ష్మరుణాల ద్వార అక్రమ వడ్డీ విధించడం వల్ల కుటుంబాలు ఛిద్రమవుతున్నాయని, వాటిని అరికట్టడానికి స్త్రీనిధి పథకాన్ని ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు. ఈ పథకానికి రూ. 1100 కోట్లు ఖర్చు చేయడంతో పాటు 48 గంటల్లో మహిళలకు రుణాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్త్రీనిధి భవన నిర్మాణాలకు గాను 365 కోట్ల రూణాలు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన యాదగిరిగుట్ట లక్ష్మినర్సింహ స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు మంత్రి జానా రెడ్డి కూడా ఉన్నారు. 

ప్రభఊుత్వం గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని జానా రెడ్డి చెప్పారు. రైతన్నలకు 30 లక్షల పంపుసెట్లు ఉచిత విద్యుత్ పథకం ద్వారా అందిస్తునట్లు ఆయన తెలిపారు. ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో మంచినీటిని పూర్తి స్థాయిలో అందించడానికి తమ శాఖ పూర్తి స్థాయిలో పనిచేస్తోందని ఆయన చెప్పారు.