ఐఎఎస్‌ల ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్

ఐఎఎస్‌ల ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో, ఇతర కేసుల్లో ఐఎఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ చేసిన 26 వివాదాస్పద జీవోలపై వారిని ప్రాసిక్యూట్ చేసేందుకు సిబిఐ అనుమతి అడిగింది. ఈ జీవోల కారణంగానే వైయస్ జగన్ పెద్ద యెత్తున అక్రమాలకు పాల్పడి సొమ్ము పోగు చేసుకున్నారనే ఆరోపణ ఉంది. ఇందుకు సంబంధించి ఆరు మంత్రులకు, ఐఎఎస్ అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

వివిధ కేసులకు సంబంధించి ప్రస్తుత జైలులో ఉన్న  బిపి ఆచార్య , శ్రీలక్ష్మిలనే కాకుండా ఇతర ఐఎఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు కూడా ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆయన శనివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను కూడా సిబిఐ ప్రాసిక్యూట్ చేయనుంది. దీంతో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అక్కడి నుంచి బదిలీ చేసి, వెయిటింగులో ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరో ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిని కూడా బదిలీ చేసి వెయిటింగులో పెట్టే అవకాశాలున్నాయి. 

తాజా పరిణామంతో ఐఎఎస్ అధికారుల్లో కలవరం ప్రారంభమైంది. కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో భారతి సిమెంట్స్ ప్రతినిధులు శనివారం సిబిఐ ముందు హాజరయ్యారు. మరోవైపు, తమ సంస్థల ఆస్తుల జప్తునకు సంబంధించి వైయస్ జగన్‌కు చెందిన జననీ ఇన్‌ఫ్రా, సాక్షి మీడియా శనివారం సిటీ సివిల్ కోర్టులో కెవియట్ దాఖలు చేశాయి. ఆస్తుల జప్తునకు సిబిఐ కోర్టును ఆశ్రయిస్తే ఆ సందర్భంగా తమ వాదనలు వినిపిచేందుకు జననీ ఇన్‌ఫ్రాకు, సాక్షి మీడియాకు అవకాశం ఉంటుంది. 

వైయస్ జగన్‌కు చెందిన మీడియా సంస్థల ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోల ఆధారంగా సిబిఐ కోర్టు నుంచి అనుమతి పొంది ఆస్తులను జప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే జగన్ మీడియా సంస్థలు సిటీ సివిల్ కోర్టులో కెవియట్ దాఖలు చేశాయి.