జైళ్లకెళ్లే వారిని గెలిపించొద్దు

జైళ్లకెళ్లే వారిని గెలిపించొద్దు

 జైళ్లకు వెళ్లే వారిని, జైళ్లకు పంపించే వారిని  ఉప ఎన్నికల లో గెలిపించవద్దని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆదివారం గుంటూరు జిల్లాలో అన్నారు. ఎమ్మార్, సోంపేట, వాన్‌పిక్ సహా ఎస్‌ఈజడ్‌లకు భూకేటాయింపులు రద్దు చేసిన రైతులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మంత్రులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ఎదుట హాజరుకావడం సిగ్గుచేటు అన్నారు.

అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులు తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే వారు సిబిఐ ఎదుట హాజరు కావాలన్నారు. దేశానికి రైతే రాజు అని, గిట్టుబాటు ధరలపై రాజకీయ పార్టీలు కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. చట్టసభల్లో చేస్తున్న చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉంటున్నాయని మండిపడ్డారు.

సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న మంత్రులను విడిచిపెట్టి కేవలం  వైయస్సార్ కాంగ్రెసు  పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే విమర్శించడం సరికాదన్నారు. అవినీతి మంత్రులకు ఉద్వాసన పలకాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్న మంత్రులే ప్రస్తుతం డెబ్బై శాతం కొనసాగుతున్నారన్నారు.

మంత్రులు, అధికారుల ప్రమేయం లేకుండా మ్యాట్రిక్స్ ప్రసాద్, కోనేరు ప్రసాద్ వంటి వారు తప్పు చేయలేరన్నారు. అందరినీ విచారించాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం లిక్కర్ మాఫియాను ప్రోత్సహిస్తోందన్నారు. ఈ నెల 25వ తేదిన ఎక్సైజ్ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన చెప్పారు. నారాయణ ఆదివారం నల్లగొండ జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో, గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన మరో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.