మోపిదేవిని విచారించనున్న సిబిఐ

మోపిదేవిని విచారించనున్న సిబిఐ

వాన్‌పిక్‌కు భూముల కేటాయింపుపై ప్రస్తుత ఎక్సైజ్ శాఖ  మంత్రి మోపిదేవి వెంకట రమణను  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) విచారించనుంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మోపిదేవికి సిబిఐ బుధవారం సూచించింది. అయితే తాను ప్రస్తుతం ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, వీలైతే ఒకటి రెండు రోజులలో వస్తానని ఆయన సిబిఐకి చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వాన్ పిక్ కోసం పదిహేను వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది.

స్థానిక రైతుల నుండి అతి చౌకగా భూములను సేకరించి వాన్ పిక్‌కు కేటాయించడమే కాకుండా, నిమ్మగడ్డ ప్రసాద్‌కు అప్పటి ప్రభుత్వం అనేక వెసులుబాట్లు కల్పించిందనే ఆరోపణలు ఉన్నాయి. వాన్ పిక్‌కు భూములను అప్పగించినందుకే నిమ్మగడ్డ ప్రసాద్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీలలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

దీనిపై రెండు రోజుల పాటు ప్రసాద్‌ను, బ్రహ్మానంద రెడ్డిని సిబిఐ విచారించింది. అనంతరం మంగళవారం వారిని అరెస్టు చేసింది. మంగళవారం రాత్రి అంతా ప్రసాద్‌ను సిబిఐ అధికారులు దిల్ కుషా అతిథి గృహంలోనే ఉంచారు. ఆయనపై వాన్ పిక్‌కు భూముల కేటాయింపులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలుస్తోంది. బ్రహ్మానంద రెడ్డి, ప్రసాద్ చెప్పిన వివరాల మేరకు మోపిదేవిని విచారించేందుకు సిబిఐ సమాయత్తమయిందని తెలుస్తోంది.

కాగా జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన బ్రహ్మానంద రెడ్డి పేరు నిందితుల జాబితాలో లేదు. దీంతో సిబిఐ అతనిని నిందితుడిగా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలు చేసింది. మోపిదేవితో పాటు మంత్రి ధర్మాన ప్రసాద రావును కూడా సిబిఐ మరోసారి విచారించే అవకాశముంది. కాగా ప్రసాద్‌ను, బ్రహ్మానంద రెడ్డిని సిబిఐ అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చనున్నారు. వారి కస్టడీని కోరే అవకాశముంది.

జగన్ ఆస్తుల కేసులో బ్రహ్మానంద రెడ్డిని నిందితుడిగా పేర్కొంటూ కోర్టులో మెమో దాఖలు చేసిన సిబిఐ బ్రహ్మానంద రెడ్డి తీరును అందులో ఆక్షేపించింది. నిమ్మగడ్డ ప్రసాద్‌తో కలిసి బ్రహ్మానంద రెడ్డి నేర పూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. వాన్ పిక్‌కు 13వేల ఎకరాల భూమిని కేటాయించాలని గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లకు అప్పుడు బ్రహ్మానంద రెడ్డి లేఖలు రాశారని పేర్కొన్నారు.

ఓపెన్ బిడ్డింగ్‌కు అవకాశం ఉన్నప్పటికీ నిమ్మగడ్డకు ప్రయోజనం చేకూర్చేలా బ్రహ్మానంద రెడ్డి వ్యవహరించారని తెలిపారు. మంత్రివర్గం ఆమోదం లేకున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా జివో వచ్చిందన్నారు. ఓ ప్రయివేటు కంపెనీకి లాభం చేకూర్చేలా జివోలో తప్పులు ఉన్నాయని తెలిపారు.