అధినాయకుడిని ఆపలేం: భన్వర్‌లాల్

అధినాయకుడిని ఆపలేం: భన్వర్‌లాల్

 బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమా విడుదలను ఆపలేమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఒక పార్టీకి ఆ సినిమా అనుకూలంగా ఉంటే దాని ఖర్చులు ఆ పార్టీ అభ్యర్థులు భరించేలా చూస్తామని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. అధినాయకుడు సినిమాపై నిపుణులు పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. 

అధినాయకుడు సినిమాలో అభ్యంతరకర దృశ్యాలు, మాటలు ఉంటే ఏం చేయాలో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అధినాయకుడు సినిమా శుక్రవారం రేపు విడుదలవుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ నటించిన సినిమాపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సినిమాలో అభ్యంతరకరమైన డైలాగ్స్ ఉన్నాయని అంటున్నారు. సినిమాపై ఉన్న అభ్యంతరాలను సెన్సార్ బోర్డు మాత్రమే పరిశీలించగలదని, సినిమా ఎన్నికల ప్రచారంలా ఉందా లేదా అనే విషయాన్ని మాత్రమే తాము అధ్యయనం చేస్తామని భన్వర్‌లాల్ చెప్పారు. 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికపై, చానెల్‌పై వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రాన్ని తొలగించాలని చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన వివరణలు తమకు అందాయని, వాటిని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపుతున్నామని ఆయన చెప్పారు. 

ఇప్పటి వరకు ఎన్నికల తనిఖీలో భాగంగా అక్రమ రవాణా చేస్తున్న రూ. 25.46 కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 1.63 లీటరల్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 33 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. 

నెల్లూరు లోకసభ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెసు అభ్యర్థి సుబ్బరామిరెడ్డి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. తిరుపతిలో కాంగ్రెసు నేతలు ఓటర్లను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కూడా వారు ఫిర్యాదు చేశారు. కాంగ్రెసు నాయకుడు వి. హనుమంతరావు మౌనదీక్ష వ్యవహారాన్ని సుమోటాగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని వారు ఎన్నికల సంఘాన్ని కోరారు.