నేరస్థులతో జగన్‌కు సంబంధం: కిరణ్

నేరస్థులతో జగన్‌కు సంబంధం: కిరణ్

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం చిత్తూరు జిల్లాలోని తిరుపతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఉప ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

వైయస్ జగన్ తన వర్గం నేతలతో తాను ముఖ్యమంత్రి కావడానికే రాజీనామా చేయించారని ఆరోపించారు. ఆయనకు పదవి పైన మోజు పుట్టిందన్నారు. పదవి పైన ఆశ ఉండటం తప్పు కాదని, అయితే దానికి సమయం, సందర్భం ఉంటుందని, అప్పటి వరకు ఆగాల్సి ఉంటుందన్నారు. కానీ జగన్ మాత్రం సమయం కోసం చూడకుండా అప్పటికప్పుడే పీఠం ఎక్కాలని ఉవ్వీళ్లూరుతున్నారన్నారు.

అందుకే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి బద్ద శత్రువు అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో జత కలిసి ప్రభుత్వాన్ని కూలదోయాలని చూశాడన్నారు. జగన్ వర్గం నేతలు పదహారు మంది ఎమ్మెల్యేలు పోయినప్పటికీ, చిరంజీవి తన పార్టీ విలీనం చేయడం ద్వారా పదహారు కలిశాయన్నారు.

2009లో కాంగ్రెసు ఎన్ని సీట్లను గెలుపొందిందో ఇప్పుడు అన్ని సీట్లు ఉన్నాయన్నారు. జగన్‌కు గానీ, వైయస్‌కు గాని కాంగ్రెసు, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎలాంటి నష్టం చేయలేదన్నారు. వైయస్‌కు రెండు సార్లు పిసిసి పీఠం కట్టబెట్టింది కాంగ్రెస్సే అన్నారు. ఆ తర్వాత సోనియా రెండుసార్లు ఆయనకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించారన్నారు.

వైయస్ కుటుంబానికి కాంగ్రెసు మేలు చేసిందన్నారు. కాంగ్రెసు గెలుపు కోసం అందరూ కృషి చేయాలన్నారు. వెంకట రమణకు ఓటు వేసి ఘన విజయం అందించాలన్నారు. కాంగ్రెసును విభజించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. లక్షల అడుగులలో ఇల్లు కట్టుకున్న జగన్ పేదల గురించి ఆలోచిస్తాడా అన్నారు. నేరస్థులతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రజా జీవితంలో ఉండటం సరికాదన్నారు.

జగన్‌కు ఓటేస్తే రాష్ట్రం ఏమవుతుందో ఆలోచించాలన్నారు. విచారణలో భాగంగానే సాక్షి అకౌంట్స్ ఫ్రీజ్ చేశారన్నారు. దానితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తుపాకులు రవాణా చేస్తున్న వారితో, హంతకులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయన్నారు. మరో రెండు మూడు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మద్యం పాలసీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసు పార్టీ సంక్షేమ పథకాల పుస్తకాన్ని విడుదల చేశారు. కాగా అంతకుముందు కిరణ్, చిరంజీవిలు రాకముందు సభా వేదికకు దగ్గరగా వంట చేస్తున్న చోట గ్యాస్ లీకు కావడంతో కొద్దిసేపు గందరగోళం చెలరేగింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు.