టిడిపి నేతకు టిక్కెటా!

టిడిపి నేతకు టిక్కెటా!

 ప్రభుత్వ చీప్ విఫ్ గండ్ర వెంకట రమణ రెడ్డి వర్గం బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కాసేపు హల్ చల్ సృష్టించింది. తమ నేత గండ్ర జ్యోతికి పరకాల నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలువురు కార్యకర్తలు ఉదయం సిఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. గండ్ర సతీమణి జ్యోతికే టిక్కెట్ ఇవ్వాలని వారు ప్లకార్డులు ప్రదర్శించారు.

మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖను పరకాలలో ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థి జ్యోతినే అని, ఆమెకే టిక్కెట్ కేటాయించాలని వారు అన్నారు. వి వాంట్ గండ్ర ఫ్రం పరకాల అంటూ నినాదాలు చేశారు. వరంగల్ జిల్లాలో గండ్రకు మంచి పేరు ఉందని, అది తగ్గించేందుకే కొందరు ఉద్దేశ్య పూర్వకంగా బిసి పేరును తెరపైకి తీసుకు వచ్చారని వారు ఆరోపించారు.

గండ్ర వర్గం ఆందోళనకు స్పందించిన ,కిరణ్ ,వెంకట రామ్ రెడ్డి,గం డ్ర జ్యోతిలను కార్యాలయంలోనికి పిలిపించుకొని మాట్లాడారు. వారు పరకాల టిక్కెట్‌ను తమకే ఇవ్వాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే కిరణ్ దానిపై వారికి వివరణ ఇచ్చారని అంటున్నారు.

కాగా పరకాల నియోజకవర్గం నుండి పోటీకి గండ్ర జ్యోతి పేరు మొదటి నుండి వినిపిస్తోన్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా కొండా సురేఖను దృష్టిలో పెట్టుకొని పలువురు నేతలు బిసి నేత అయిన సమ్మారావు పేరు అధిష్టానానికి సూచించారట. సమ్మారావు పేరు దాదాపు ఖరారైనట్లుగా మంగళవారం వార్తలు వచ్చాయి. దీంతో గండ్ర దంపతులు టిక్కెట్ కోసం చివరి ప్రయత్నంగా సిఎంను ఉదయం కలిశారు.

కాగా పరకాల టిక్కెట్ సమ్మారావుకు ఇవ్వడంతో తమ వర్గం నేతలు పూర్తిగా అసంతృప్తికి లోనయ్యారని గండ్ర సతీమణి గండ్ర జ్యోతి చెప్పారు. పరకాల టిక్కెట్ కేటాయింపుపై అధిష్టానం పునరాలోచించుకోవాలని గండ్ర వెంకట రమణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం టిడిపికి రాజీనామా చేసి సాయంత్రం కాంగ్రెసు అభ్యర్థిగా ప్రచారం చేయడమేమిటన్నారు. కాంగ్రెసు సభ్యత్వం లేనివారికి టిక్కెట్ ఇవ్వడం సరికాదన్నారు.

పరకాల అభ్యర్థిత్వంపై తాము చింతిస్తున్నామని వారిద్దరు చెప్పారు. అక్కడ తాము ఆరేడు నెలల పాటు పర్యటించి, పార్టీని బలోపేతం చేశామని చెప్పారు. టిడిపి నుండి వచ్చిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వడం తమ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ బొత్స  దృష్టికి తాము ఈ విషయాన్ని తీసుకు వెళ్లామని చెప్పారు. వేరే అభ్యర్థిని నిలబెడితే ఓడిస్తామని కార్యకర్తలు చెబుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు.