సోనియాను కలిసిన చిరంజీవి

సోనియాను కలిసిన చిరంజీవి

 రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసన సభ్యుడి చిరంజీవి బుధవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఆయన  సోనియా గాంధీతో  దాదాపు పావుగంట పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో చెన్నైలోని తన వియ్యంకుడి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు, రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

తన కూతురు సుష్మిత ఇంట్లో ఇటీవల ఆదాయపు పన్ను శాఖ రూ.35 కోట్లకు పైగా డబ్బులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల నేపథ్యంలో తన కూతురు ఇంట్లో డబ్బులు దొరకడంతో చిరంజీవిపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి సోనియా గాంధీని కలవడం చర్చనీయాంశమైంది.

ఈ చట్రం నుండి బయటపడేందుకే ఆయన సోనియాను కలిసి ఉంటారని అంటున్నారు. సుష్మిత ఇంట్లో ఐడి దాడులు జరిపిన సమయంలో చిరంజీవి రాష్ట్రంలోనే ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. డబ్బులు దొరికినట్టు తెలియగానే ప్రతిపక్షాలు.. ఆ డబ్బు అధిష్టానం చిరంజీవికి తిరుపతి ఉప ఎన్నికల ఖర్చు కోసం పంపించిందని ఆరోపణలు చేశారు. ఆ వార్తలను చిరంజీవి ఖండించారు. డబ్బులు దొరికింది తన వియ్యంకుడి ఇంట్లో కాదని, వియ్యంకుడి వియ్యంకుడి ఇంట్లో అని చెప్పారు.

అయితే ఆ డబ్బు దొరికింది చిరు వియ్యంకుడి ఇంట్లోనే అని సిబిఐ ప్రకటించింది. ఆ వెంటనే  చిరంజీవి  మంగళవారం హైదరాబాదు నుండి ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం కేంద్రమంత్రి వాయలార్ రవిని కలిశారు. ఆయనతో కూడా ఈ విషయంతో పాటు ఉప ఎన్నికలపై చర్చించారు. ఈ రోజు సోనియాను కలిశారు.

కాగా వాయలార్ రవి ఈ రోజు రాష్ట్రానికి రానున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన కాంగ్రెసు పార్టీ నేతలతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష జరపనున్నట్లు తెలుస్తోంది. ఆయన మూడు రోజుల పాటు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితలతో కలిసి ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.