సదానందపై యడ్డీ నిప్పులు

 సదానందపై యడ్డీ నిప్పులు

 ముఖ్యమంత్రి సదానంద గౌడపై మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత యడ్యూరప్ప సోమవారం నిప్పులు చెరిగారు. ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. కర్నాటకలో తాను అనేక అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నానని చెప్పారు. తనకు 71 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, సుమారు 40మంది ఎమ్మెల్యేలు బిజెపిని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో, బిజెపిలో సంక్షోభానికి తాను ఏమాత్రం కారణం కాదని చెప్పారు.

పార్టీ నేత అనంత్ కుమార్ వైఖరిని యడ్యూరప్ప తప్పు పట్టారు. సంక్షోభానికి అనంత్ కుమార్, సదానంద గౌడే కారణమన్నారు. ఉప ఎన్నికలలో బిజెపి ఓడిపోయిందని, అయినా ముఖ్యమంత్రి సదానంద రాజీనామా చేయలేదన్నారు. ఇంకా పదవి పట్టుకొని వేళ్లాడుతున్నారని మండిపడ్డారు. తాను పార్టీకి రాజీనామా చేయలేదని చెప్పారు. పార్టీ పెద్దలు తనను పార్టీని వీడవద్దని కోరారని చెప్పారు. అధిష్టానానికి తాను మరికొంత సమయాన్ని ఇస్తున్నానని చెప్పారు.

ముఖ్యమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు తనను అవమానించారన్నారు. నలభై మంది ఎమ్మెల్యేలు తనకు రాజీనామా లేఖ ఇచ్చారని చెప్పారు. తాను గాని, తన మద్దతుదారులు గానీ బిజెపిని వీడటం లేదని చెప్పారు. అనంత్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారని చెప్పారు. సదానంద గౌడ బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి కాదన్నారు. తాను పార్టీ చేతిలో మోసపోయానని అన్నారు.

కాగా యడ్యూరప్ప ఏ క్షణంలోనైనా పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ అధిష్టానానికి ఆయన కొన్ని షరతులు పెట్టినట్లుగా తెలుస్తోంది. తన షరతులకు అధిష్టానం ఆమోదించిన పక్షంలో ఆయన పార్టీలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. షరతులకు అంగీకరించని పక్షంలో బిజెపిలో ఆయన చీలిక తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నాటక రాష్ట్రంలో బలమైన లింగాయత సామాజిక వర్గంలో ఆయన ప్రధానమైన నేత.


దీంతో పార్టీ అధిష్టానం ఆయనను దూరం చేసుకోకూడదని భావిస్తోంది. దీంతో ఆయన పెట్టే షరతులకు అంగీకరించే అవకాశముంది. ఈ రోజు ఉదయం పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు అల్పాహార విందు ఇచ్చిన యడ్డీ, సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీకి మరింత గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. శంకర లింగయ్యకు మంత్రి పదవి ఇవ్వవద్దని, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆరుగురికి తాను సూచించిన వ్యక్తులకే పదవి ఇవ్వాలని, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా తాను సూచించిన వారికే ఇవ్వాలని ఆయన అధిష్టానం వద్ద షరతులు విధించినట్లుగా తెలుస్తోంది.

కాగా కర్నాటక రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 224. అందులో  బిజెపి  ఎమ్మెల్యేల సంఖ్య 119. యడ్యూరప్పకు తనకు 71 మంది మద్దతు ఉందని చెబుతున్నారు. అదే నిజమైతే పార్టీ, ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నట్లే. ప్రభుత్వం ఏర్పడటానికి కావాల్సిన కనీస ఎమ్మెల్యేలు 112.