జగన్‌కు మద్దతేమిటి: మధు యాష్కీ

జగన్‌కు మద్దతేమిటి: మధు యాష్కీ

 తెలంగాణ వనరులను దోచుకుని పత్రిక, టీవీ చానల్‌ను పెట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు తెలంగాణ ప్రాంత నేతలు మద్దతు తెలపడం ఏమిటని కాంగ్రెసు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ  ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీల చేతిలోని ప్లకార్డును లాక్కొని సమైక్య వాణిని వినిపించడమే కాకుండా ప్రత్యేక రాష్ట్రం రాకుండా అడ్డుపడిన ద్రోహికి తెలంగాణ ప్రాంత రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, జర్నలిస్టుల నేతలు సంఘీభావం చెప్పడం అమరవీరులను అవమానించడమేనని యాష్కీ అభిప్రాయపడ్డారు. 

మిలియన్ మార్చ్ సందర్భంగా సీమాంధ్ర మీడియాను కేసీఆర్ అడ్డుకుని ఆ తర్వాత తెలంగాణ పేపర్, చానల్‌ను ప్రారంభించారని యాష్కీ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు సాక్షి మీడియాకు తెరాస మద్దతు తెలపడం చూస్తుంటే జగన్‌కు, కేసీఆర్‌కూ మధ్య అవగాహన కుదిరిందేమోనన్న సందేహాలు నెలకొంటున్నాయని అన్నారు. తెరవెనుక అవగాహనకు బదులు బాహాటంగా పరకాలలో సురేఖపై తెరాస పోటీ చేయకపోవడమే ఉత్తమమని యాష్కీ అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పావులు కదిపిన వైయస్ ఫొటో ఉన్న పత్రికకు మద్దతు చెప్పవద్దని ప్రజా గా యకుడు గద్దర్, విమలక్కలకు తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తూ, ఆయన ఆస్తుల లావాదేవీలను, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తే అది పత్రికా స్వేచ్ఛకు భంగం ఎలా అవుతుందని నిలదీశారు. ఆ లెక్కన ప్రస్తుతం జైల్లో ఉన్న సూర్య పత్రిక ఎండీ నూకారపు సూర్యప్రకాశరావు, సీబీఐ అరెస్టు చేసిన మా టీవీ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్‌ల విషయంలో జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని నిలదీశారు. 

ఆ సంస్థలు మూతపడితే వాటిలో ఉద్యోగులు రోడ్డుమీద పడరా అని నిలదీశారు. జగన్ పత్రిక నిండా 'ఎల్లో కలర్' కనిపిస్తుందని, ఆ పత్రికలో రాతలు ఎల్లో జర్నలిజమని ఆరోపించారు. జగన్ మీడియా సంస్థలతో పాటు ఆయనద్వారా లబ్ధి పొందిన హీరో నాగార్జున లాంటివారిపైనా చర్యలు తీసుకోవాలని యాష్కీ డిమాండ్ చేశారు. వైయస్ ఆత్మగా కొనసాగిన కేవీపీని ముందుగా అరెస్టు చేయాల్సి ఉందని అన్నారు. దీనిపై సీబీఐ డైరెక్టర్‌ను తెలంగాణ ఎంపీలు కోరనున్నట్లు తెలిపారు. జగన్‌ను అరెస్టు చేస్తే సానుభూతి రాదని, అలాంటివారు గెలిచి అధికారంలోకి వస్తే అరాచకం నెలకొంటుందని యాష్కీ అన్నారు.