జగన్‌పై విహెచ్ ఫైర్

జగన్‌పై విహెచ్ ఫైర్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు   వి.హనుమంత రావు ఆదివారం తన నివాసంలో నిప్పులు గక్కారు. జగన్ నేర చరిత్రను ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. జగన్ ఓ గూండా అని, ఆయనకు కేవలం డబ్బు, పదవి మీద మాత్రమే కోరిక ఉందని తాను ఇప్పటి వరకు భావించానని, కానీ మనుషులను కూడా చంపే ఆలోచన అతనికి ఉందని ప్రజలు తెలుసుకోవాలన్నారు. భాను కిరణ్ ఆఫ్రికాలో కూడా సెటిల్మెంట్లు చేశాడంటే మన పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు.

భానుతో సంబంధాలపై జగన్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. జగన్ సన్నిహితుడు మంగళి కృష్ణకు తాను డబ్బులు ఇచ్చినట్లు భాను విచారణలో ఒప్పుకున్నారన్నారు. దీనిపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదన్నారు. జగన్‌కు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వంటి దేవుడిపై భక్తి లేదని విమర్శించారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం 1923లో బ్రిటిష్ హయాం నుండే అమలు పరుస్తున్నారన్నారు. కానీ జగన్ మాత్రం అక్కడ శ్రీవారిని కాదని తనకు జిందాబాద్‌లు కొట్టించుకున్నారని మండిపడ్డారు.

దేవుడితో నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఇతర నేతలపై మండిపడటం సరికాదన్నారు. అసలు దేవుడితో నీచ రాజకీయాలు చేస్తుంది జగనే అని ఆరోపించారు. ఆ రాజకీయాలు రాష్ట్రంలో ప్రారంభించిందే జగన్ అన్నారు. కడప జిల్లాకు జగన్ గానీ, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కానీ ఏం చేశారని ప్రశ్నించారు. బ్రాహ్మణి స్టీల్ పేరిట వేలాది ఎకరాలు అప్పనంగా ఇచ్చారన్నారు. పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉపయోగపడుతుందని ఎస్ఈజెడ్‌లు ఏర్పాటు చేశారన్నారు.

కానీ వైయస్ తన హయాంలో అప్పనంగా భూములు ఇచ్చారని, ఇప్పటి వరకు అక్కడ పరిశ్రమలు ప్రారంభం కాలేదన్నారు. దీనిని కడప ప్రజలు గుర్తించాలని హితవు పలికారు. సొంత జిల్లాకు ఏం చేయని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. ఎస్ఈజెడ్‌పై తాను ప్రధానమంత్రికి లేఖ రాశానని చెప్పారు. తండ్రి సింపతిని జగన్ ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెసు నేతలు ఆయనకు కౌంటర్ వేయాలని సూచించారు.

తెలుగుదేశం పార్టీతో కలిసి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు. జగన్ పైన సొంత పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారని, అందరూ స్పందించాల్సిన అవసరముందన్నారు. తాను ఉప ఎన్నికలు జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించి, ఆయన అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజెప్పుతానని చెప్పారు. కాంగ్రెసు డబ్బులు పంచడానికి సిద్ధంగా ఉందన్న జగన్ వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు.

డబ్బులు పంచడానికి కాంగ్రెసు వద్ద ఏమీ లేదని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించింది జగనే అన్నారు. ఆయన డబ్బులు పంచుతాడని విమర్శించారు. కాంగ్రెసు ప్రజలకు మేలు మాత్రమే చేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం చూపించి ఓట్లడుగుతామని చెప్పారు. కడప ప్రజలకు ఎంతమందికి జగన్ ఉద్యోగాలు ఇప్పించారన్నారు. కడప ఐరన్ ఓర్ డబ్బులు ఎక్కడికి పోయాయని చెప్పారు.

ఇలాంటి వ్యక్తికి ఓటు వేయవద్దని, కడప ప్రజలు ఆలోచించాలన్నారు. ఆయనకు వేస్తే మన కాలు, మన చేయి మనం నరుక్కున్నట్లే అన్నారు. జగన్ తాను ఉప ఎన్నికలలో ఓడిపోతానని తెలిస్తే తన వెనుక భాను, మంగళి కృష్ణ ఉన్నాడని కూడా బెదిరిస్తాడని విమర్శించారు. ప్రజల కోసం పదవీ త్యాగం చేసిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న రాహుల్ గాంధీకి మద్దతిచ్చి కాంగ్రెసుకు ఓటు వేయాలన్నారు.

జగన్ ఓదార్పు పేరుతో డబ్బులు పంచుతూ ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. జగన్ మోస్ట్ డేంజర్ అన్నారు. ఆయన నేర చరిత్రను గుర్తించాలన్నారు. రక్తం రుచి మరిగిన వాడు ఎవరినీ వదిలి పెట్టడన్నారు. భాను కిరణ్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పరకాలలో ఓట్లను చీల్చి జగన్ అభ్యర్థి కొండా సురేఖను గెలిపించేందుకే భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తోందని ఆరోపించారు.  జగన్ ‌కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట్లాడాలన్నారు.